Sleep Quality Tips : రాత్రుళ్లు పదే పదే నిద్ర లేస్తున్నారా? వెంటనే పడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
ఫోన్, టీవీ లేదా బల్బుల నీలి కాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే నిద్రపోయే ముందు గదిలోని అన్ని లైట్లను ఆపేయాలని చెప్తున్నారు. మొబైల్ స్క్రీన్ నుంచి కూడా దూరంగా ఉండాలంటున్నారు. దీనివల్ల మధ్యలో నిద్ర లేవాల్సిన అవసరం ఉండదు.
మెరుగైన నిద్ర కావాలంటే స్థిరత్వం ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రించడానికి, నిద్రలేవడానికి ట్రై చేయాలని చెప్తున్నారు. వారాంతాల్లో కూడా ఇదే ఫాలో అయితే మరీ మంచిది. దీనివల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి.
రాత్రి సమయంలో చెర్రీలు లేదా చెర్రీ జ్యూస్ తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో మెలటోనిన్ ఉంటుంది. బాదం, అరటిపండ్లు కూడా నిద్రను మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీనితో పాటు సాయంత్రం భారీ లేదా మసాలా ఆహారం తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నిద్రకు ఇబ్బంది ఉండదు.
నిపుణులు వైఫై రౌటర్లకు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. వాస్తవానికి వైఫై రౌటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు సర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తాయట.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తరచుగా నిద్ర నుంచి మేల్కొంటే.. ధ్యానం, బ్రీతింగ్ వ్యాయామాలు చేయండి. ధ్యానం మనస్సును శాంతింపజేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వలన శరీరం రిలాక్స్ అవుతుంది. నిద్రలోకి త్వరగా వెళ్తారు.
అలాగే నిద్ర లేకపోవడం వల్ల కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్లు అసమతుల్యమవుతాయి. ఇవి గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు.
నిద్రపోవడానికి గదిలో ఉష్ణోగ్రత దాదాపు 18 డిగ్రీల సెల్సియస్ ఉంటే మంచిది. దీనితో పాటు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాళ్లకు సాక్స్‌లు వేసుకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మెలటోనిన్ విడుదలై నిద్రకు సహాయపడుతుంది.
అంతేకాకుండా ఒత్తిడి ఎక్కువగా ఉంటే అది నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. నిపుణులు ప్రతిరోజూ బ్రీతింగ్ వ్యాయామం, తేలికపాటి వ్యాయామం లేదా జర్నలింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలు చేయమని సిఫార్సు చేస్తున్నారు.