Kidney Stones : కిడ్నీ స్టోన్స్ రాకముందే ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ప్రమాదం చాలావరకు తగ్గుతుంది

కిడ్నీలో రాళ్లు పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కిడ్నీ స్టోన్స్ నివారించడంలో నీళ్లు చాలా కీలకం. శరీరంలో నీరు తక్కువైతే మూత్రం గట్టిపడి ఖనిజాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలి. మూత్రం రంగు మారడం, నోరు ఎండిపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నీరు తాగాలి.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం స్థాయిలు పెరగొచ్చు. ఇది స్టోన్స్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించడం మంచిది.
షుగర్ ఎక్కువగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్, సోడాలు తరచూ తాగడం కిడ్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా నీళ్లకు బదులుగా ఇవి తాగడం మంచిది కాదు.
పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, నట్స్ వంటి కొన్ని ఆహారాల్లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. స్టోన్స్ హిస్టరీ ఉన్నవారు వీటిని అధికంగా తీసుకోవడం తగ్గించాలి.
అధికంగా రెడ్ మీట్, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల స్టోన్స్ ప్రమాదం పెరగొచ్చు. కాబట్టి అన్ని సమానంగా ఉండే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. నిమ్మకాయలో ఉండే సిట్రేట్ కొన్ని రకాల కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా సహాయపడొచ్చు. కానీ ఇది పూర్తి రక్షణ ఇస్తుంది అనుకోవడం తప్పు.
చాలామంది పని వల్ల లేదా బయట ఉన్నప్పుడు యూరిన్‌ను ఎక్కువసేపు ఆపుతుంటారు. ఇది మూత్ర సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఊబకాయం ఉన్నవారిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్ వ్యాయామం, హెల్తీ డైట్ అవసరం.
నడుము భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్రంలో మంట, రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణ నొప్పి అనుకుని వదిలేయడం మంచిది కాదు.