Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే

ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించేప్పుడు చేయకూడని తప్పులు ఇవే
కొత్త ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించే ముందు బాస్కెట్, ట్రేలను సూచనల ప్రకారం శుభ్రం చేయాలి. మొదటిసారి వాడే ముందు మాన్యువల్‌లో ఇచ్చిన సూచనలు, ఉష్ణోగ్రత సెట్టింగ్స్‌ను కచ్చితంగా చదివి మాత్రమే.. దానికి తగ్గట్లు ఉపయోగించాలి.
ఎయిర్ ఫ్రైయర్‌లో వేడి గాలి అన్ని వైపులా ప్రసరించినప్పుడే ఆహారం సమానంగా ఉడుకుతుంది. కాబట్టి బాస్కెట్‌ను పూర్తిగా నింపేస్తే ఆహారం సరిగ్గా ఉడకకపోవచ్చు. అలాగే క్రిస్పీగా కూడా రాకపోవచ్చు.
ఎయిర్ ఫ్రైయర్‌లో తక్కువ నూనెతోనే వంట చేసుకోవచ్చు. ఎక్కువ నూనె పోయడం వల్ల పొగ రావడం, ఆహారం జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎదురవ్వొచ్చు.
ప్రతి ఆహార పదార్థానికి ఒకే ఉష్ణోగ్రత, సమయం సరిపోవు. మొదటిసారి వంట చేసేటప్పుడు రెసిపీ లేదా తయారీదారు సూచనలను అనుసరించి.. మధ్యలో ఆహారం ఉడికిన తీరును పరిశీలించాలి.
వేడి గాలి బయటకు వెళ్లేందుకు పరికరం చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. గాలి బయటకు వచ్చే మార్గాలను మూసివేయకూడదు. వేడి తట్టుకోగల సమతల ఉపరితలంపై మాత్రమే ఎయిర్ ఫ్రైయర్ ఉంచాలి.
ఎయిర్ ఫ్రైయర్‌లో ఉపయోగించే పాత్రలు, బేకింగ్ పేపర్ లేదా ఫాయిల్ ఆ పరికరానికి అనుకూలమైనవే కావాలి. బేకింగ్ పేపర్‌ను ఖాళీగా ఉంచి ఆన్ చేయకూడదు. అలాగే గాలి ప్రవాహానికి అడ్డుపడకుండా.. హీటింగ్ ఎలిమెంట్‌కు తగలకుండా జాగ్రత్తపడాలి.
వంట పూర్తయిన వెంటనే బాస్కెట్, ట్రేలు చాలా వేడిగా ఉంటాయి. వాటిని తీసేటప్పుడు ఓవెన్ గ్లౌజులు ఉపయోగించాలి. శుభ్రం చేసే ముందు పరికరాన్ని ఆఫ్ చేసి.. ప్లగ్ తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.