Mohanlal Movies On OTT: 'దృశ్యం 3'కు ముందు... ఓటీటీల్లో మోహన్ లాల్ టాప్ 5 సూపర్ హిట్స్ చూడండి, స్ట్రీమింగ్ ఎందులోనంటే?
మోహన్ లాల్ సినిమాల అతిపెద్ద బలం ఏమిటంటే ఆయన నటన. వాస్తవికతతో ముడిపడిన కథలు, లోతైన భావోద్వేగాలు, బలమైన స్క్రిప్ట్. డ్రామా అయినా, సస్పెన్స్ థ్రిల్లర్ అయినా, అద్భుతమైన యాక్షన్ అయినా మోహన్ లాల్ ప్రతి జానర్ సినిమాలోనూ తనను తాను నిరూపించుకుంటారు. అందుకే అతని సినిమాలు ఎప్పటికీ బోర్ కొట్టవు. కానీ ప్రతి తరానికి ప్రత్యేకంగా ఉంటాయి.
మోహన్ లాల్ కెరీర్ టర్న్ చేసిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం. ఇవి ఆయన కెరీర్ ను కొత్త శిఖరాలకు చేర్చాయి. ఆయనను భారతీయ సినిమా లెజెండ్ గా నిలబెట్టాయి. ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచాయి.
మంజిల్ విరింజా పుక్కల్ (1980)... ఇది మోహన్ లాల్ మొదటి భారీ సినిమా. ఇందులో ఆయన విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనిని కేవలం 7 లక్షల బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఈ సినిమా 1 కోటి కంటే ఎక్కువ వసూలు చేసి పెద్ద హిట్ గా నిలిచింది. మలయాళ సినిమాలో 'న్యూ జనరేషన్' మూవీకి ఇది నాంది పలికింది. ఓటిటిలో ఈ సినిమా సన్ నెక్స్ట్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, జియో టీవీ లలో చూడవచ్చు.
కిరీడం (1989)... ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా మోహన్ లాల్ కు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ స్పెషల్ మెన్షన్ ను కూడా తెచ్చిపెట్టింది. ఒక సీరియస్ నటుడిగా అతని కెరీర్ కు ఇది ఒక పెద్ద మైలురాయి. ఈ సినిమా కథ ఒక సాధారణ యువకుడు (సేతు మాధవన్) కలలు, బాధల గురించి, అతను పోలీసు అధికారి కావాలనే కలతో ముందుకు సాగుతాడు. కానీ అతని జీవితం అకస్మాత్తుగా మారుతుంది. దీనిని OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్ లో చూడవచ్చు.
చిత్రం (1988లో విడుదలైన సినిమా)... మోహన్ లాల్ కెరీర్ లోనే అతి పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ సినిమా అతన్ని కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక సూపర్ స్టార్ గా నిలబెట్టింది. 44 లక్షలతో నిర్మించబడిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 3.5-4 కోట్లు వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా మోహన్ లాల్ నటించిన సినిమాల్లో 300 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడిన మొదటి చిత్రం ఇదే. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్ లో చూడవచ్చు.
భారతం (1991) ఇదొక మ్యూజికల్ డ్రామా. మోహన్ లాల్ కు ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారం అందించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాను మీరు మనోరమమాక్స్ - HD స్ట్రీమింగ్‌తో చూడవచ్చు. జియో హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చు.
వనప్రస్థం (1999)... మోహన్ లాల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సూపర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమాలో మోహన్ లాల్ కథాకళి కళాకారుడు కుంజుకుట్టన్ పాత్ర పోషించారు. అతని జీవితం కళ, కుటుంబం, ప్రేమ మధ్య చిక్కుకుపోతుంది. మోహన్ లాల్ ఈ పాత్రను చాలా సహజంగా పోషించారు. వనప్రస్థం సినిమా ఆయన కెరీర్ కు కొత్త గుర్తింపునిచ్చింది. అతనికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టింది. ఈ సినిమా 1999 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు పొందింది.
మోహన్ లాల్ ఈ మధ్య విడుదలైన 'వృషభ' సినిమాతో వార్తల్లో నిలిచారు. ఆయన మోస్ట్ అవైటెడ్ సినిమాలు 'దృశ్యం 3', 'పేట్రియాట్' 2026లో విడుదలవుతాయి.