Year Ender 2025: ఖాన్‌లు, కపూర్‌లు కాదు... బాలీవుడ్‌లో ఈ ఏడాది అదరగొట్టిన హీరోలు వీళ్ళే
ఫిబ్రవరి 14న విడుదలైన ‘ఛావా’ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. యుద్ధ, పోరాట సన్నివేశాలలో అతని నటన కథకు మరింత బలం చేకూర్చింది. ఈ సినిమా ద్వారా విక్కీ ప్రతి పాత్రలోనూ అద్భుతంగా నటించగలడని పేరొచ్చింది.
ఫిబ్రవరి 28న విడుదలైన 'సూపర్బాయ్స్ ఆఫ్ మాలేగావ్'లో అమాయక నటనతో ప్రేక్షకులను మెప్పించాడు ఆదర్శ గౌరవ్. నాసిర్ అనే చిన్న పట్టణానికి చెందిన యువకుడి పాత్రను అతను పోషించాడు.అమాయకత్వం, నిజాయితీ, జీవితంలో ముందుకు సాగాలనే కోరికను ఆదర్శ్ తెరపై చాలా అందంగా చూపించాడు. మాలేగావ్ నీడలో నిర్మించబడిన ఈ చిత్రంలో నాసిర్ పెళ్లి వీడియోలు తీయడం నుండి ఎడిటింగ్ నేర్చుకోవడం వరకు అతని ప్రయాణాన్ని చక్కగా చూపించారు. ఇందులో ఆదర్శ్ సహజమైన నటన కనబరిచారు.
దేశభక్తితో కూడిన పాత్రలకు అక్షయ్ కుమార్ స్పెషలిస్ట్. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన 'కేసరి చాప్టర్ 2' సినిమాలో మరోసారి ఆయన అద్భుతమైన నటనను కనబరిచారు. యాక్షన్, భావోద్వేగాల మధ్య సమతుల్యతను పాటిస్తూ అక్షయ్ కుమార్ ప్రతి సన్నివేశాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దారు.
'సయ్యారా'తో అహాన్ పాండే ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో అతను క్రిష్ కపూర్ పాత్ర పోషించాడు. తన మొదటి సినిమాలో, నటుడిగా మొదటి పాత్రలో అహాన్ భావోద్వేగాలను చూపిన తీరు, అతని నటన ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆగస్టు 1న విడుదలైన 'ధడక్ 2'లో సిద్ధాంత్ చతుర్వేది తన కెరీర్ లోనే అత్యంత భావోద్వేగభరితమైన నటనను కనబరిచాడు. నిలేష్ అనే దళిత యువకుడి పాత్రలో అతను కనిపించాడు. సిద్ధాంత్ హృదయపూర్వక నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' సినిమాలో రణవీర్ సింగ్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పాత్రలో ఆయన చూపించిన అద్భుతమైన ఎనర్జీ, ప్రత్యేకమైన మేనరిజమ్స్ పాపులర్ అయ్యాయి.
'ధురంధర్' సినిమాలో హంజా అలీ మజారి పాత్ర పోషించాడు రణవీర్. రెహమాన్ డెకాయిత్ ముఠాలో నెమ్మదిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, తర్వాత వేసే ఎత్తుకు పైఎత్తులు సినిమాను మెమరబుల్ గా మార్చాయి.