In Pics : తిరుమలకు చేరుకున్న శ్రీవిల్లి పుత్తూరు మాలలు, గరుడసేవ నాడు శ్రీవారికి అలంకరణ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి మాలలు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో.ధర్మారెడ్డి, తమిళనాడు దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ సెల్లదొరై, విల్లిపుత్తూరు ఆలయ ఛైర్మన్ రవిచంద్రన్ ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీరంగమన్నార్ స్వామి వారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామి వారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.
తిరుమలకు చేరుకున్న శ్రీవిల్లి పుత్తూరు మాలలు
సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.