Srikakulam Politics :  ఈసారి శ్రీకాకుళం రాజకీయంలో అనూహ్య మార్పులు చూడబోతున్నాం. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌సీపీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోందని అంటున్నారు జిల్లా నాయకులు. ఎంపీ అభ్యర్థి ఎంపిక జిల్లా వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపేలా చేస్తుందని టాక్ నడుస్తోంది. ఇంత వరకు నడుస్తున్న రాజకీయంలో చిన్న ఛేంజ్ తీసుకురాబోతోందని జిల్లా వైసీపీ నాయకత్వం చెప్పుకుంటోంది. 


ప్రస్తుతానికి ఎచ్చెర్లపై దృష్టి పెట్టి వైసీపీ అధినాయకత్వం... ఇద్దరు కీలక నేతలను పిలిచి చర్చలు జరుపుతోంది. తర్వాత దశలో అంటే సంక్రాంతి తర్వాత మిగతా వారి సంగతి తేల్చేయాలని యోచిస్తోంది. విజయనగరం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడిగా ఉన్న చిన్నశ్రీనును ఈసారి ఎచ్చెర్ల నుంచి రంగంలోకి దించుతారన్న ప్రచారం ఎప్పట్నుంచో సాగుతోంది. ఈ వాదనకు బలం ఇచ్చే వార్త ఒకటి జిల్లాలో చక్కర్లు కొడుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొర్లె కిర్‌ కుమార్‌, చిన్న శ్రీనును తాడేపల్లి నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు. 


చిన్నశ్రీను ఎచ్చెర్ల నుంచి పోటీలో ఉంటారన్న విషయం గొర్లె కిరణ్ కుమార్‌కు ముందే తెలుసని అనుచరులు అంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను అంత సులువుగా మార్చబోని అనుకున్నారు. ఇంతలో ఆయనకు వ్యతిరేకంగా వైసీపీలో గ్రూప్‌లు కూడా ఎక్కువ అయ్యాయి. వారంతా కిరణ్‌ను మార్చాలని పట్టుబడుతున్నారు. వాళ్లకు కనిపిస్తున్న ఆప్షన్ చిన్నశ్రీను. 


సామాజిక బస్సు యాత్ర విజయవంతం చేసిన కిరణ్‌ను కొనసాగిస్తారన్న  వాదన నియోజకవర్గంలో ఊపందుకుంది. చిన్నశ్రీనుకు జెడ్పీ చైర్మన్ ఉంది కాబట్టి కిరణ్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వాలని పార్టీ భావిస్తందని అంతా నుకున్నారు. కానీ సీఎంవో నుంచి వీళ్లిద్దరికే పిలుపురావడంతో కిరణ్‌ మార్పు తప్పదా అనే చర్చ నడుస్తోంది. 


ఆమదాలవలస నియోజకవర్గంపై ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌గా ఉన్న తమ్మినేని సీతారామ్‌కు టికెట్ వస్తుందా రాదా అనే డైలమా ఇప్పటి వరకు ఉండేది. ఓ దశలో ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని కూడా ప్రచారం నడిచింది. అయితే తమ్మినేని వైపే జగన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. సర్వేల్లో ఆయన గెలుస్తారని రాకపోయినా కూన రవికుమార్‌ను ఎదుర్కొవడానికి తమ్మినేనే కరెక్టని భావిస్తున్నారట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. 


వాస్తవానికి 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మార్చినప్పుడు తమ్మినేని సీటు కూడా మారుస్తారని అనుకున్నారు. ఆ తర్వాత రోజు సిక్కోలు టూర్‌కు వచ్చిన సీఎం కార్యక్రమాల్లో సీతారాం డల్‌గానే కనిపించారు. దీంతో ఆయనకు ఎసరు తప్పదేమో అనుకున్నారంత. అయితే ప్రత్యామ్నాయం లేదని పోల్ మేనేజ్‌మెంట్‌ సరిగా చేసుకుంటే సీతారామ్‌ గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందర్నీ కొలుపుకొని వెళ్లగలిగితే విజయం పెద్ద విషయం కాదనే భావనతో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ కోణంలోనే సీతారామ్‌కు ఓకే చేసినట్లు తెలుస్తుంది. 


అమదాలవలస విషయంలో ఎంపీగా పోటీలో ఉండే వ్యక్తి చరిష్మా తోడైతే స్వల్ప మెజార్టీతో గట్టెక్కొచ్చని జిల్లా నేతలు కూడా చెప్పారట. మిగతా నియోజకవర్గాల వరకు వస్తే ఇచ్చాపురం, పాతపట్నం తేలాల్సిఉంది. ఇది సంక్రాంతిలోపు జరగదని తెలుస్తుంది. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయాలని తమ్మినేని సీతారామ్‌కు చెబితే ఆయన కాదన్నారని సమాచారం. ఆ తర్వాత రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావును అడిగారు. ఆయన కూడా అందుకు అంగీకరించలేదు. వీరిద్దరిలో ఎవరు పార్లమెంట్‌కు వెళ్లినా, వారి అసెంబ్లీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఇప్పటికిప్పుడు నిలపడం కష్టసాధ్యమైన పనే అంటున్నారు జిల్లా లీడర్లు. 


అందుకే ఎంపీగా వెళ్లే అభ్యర్థికి సామాజిక బలంతోపాటు ఆర్థిక శక్తి కూడా ఉండేలా చూస్తున్నారు. జిల్లాలో మేజర్ సామాజికవర్గాలుగా ఉన్న కళింగ, వెలమల వైపు నుంచే ఏ పార్టీ అయినా ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతోంది. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం తరఫున వెలమలు, కాంగ్రెస్ తరఫున కాళింగులు ఎంపీగా గెలుస్తూవచ్చారు. మూడో ప్రధాన సామాజికవర్గమైన కాపులు వారి ప్రాబల్యం ఉన్నచోట్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి కాపు అభ్యర్థిని ఎంపీగా పంపాలని వైసీపీ భావిస్తోంది. దీని వల్ల ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు పోలరైజ్ అవుతుందని ప్లాన్ చేస్తోంది. 


విడిపోయిన జిల్లాలో కాపులు కాళింగుల సంఖ్య సమానంగా ఉంది. ఇప్పుడు వారికి టిక్కెట్ ఇవ్వడం వల్ల ఏఏ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారన్నది తెలాల్సిన లెక్క. పక్క జిల్లా విజయనగరంలో కూడా ఇదే తూర్పుకాపు అభ్యర్థికి ఎంపీగా పంపనుంది. ఇప్పటికే మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ తాను సిద్ధమన్న సంకేతాలు పంపారు. బొత్స తనయుడు డాక్టర్ సందీప్ రాజకీయ ఆరంగేట్రానికి రెడీ అయ్యారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా ఉన్నారు. విజయనగరంలో ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కాపులే అవుతారు. కాబట్టి శ్రీకాకుళం నుంచి తూర్పుకాపులకు ఇవ్వడం ఎంతవరకు పార్టీకి మేలు చేస్తుందనేదే చూడాలి. ఇదే నిర్ణయం పార్టీ తీసుకుంటే ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేటలో వైకాపా అభ్యర్థుల విజయావకాశాలు మెరుగవుతాయి.