Ys Sharmila Comments on Merging With Congress: వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఆశయ సాధనం కోసం కాంగ్రెస్ పార్టీలో పని చేస్తానని వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు. గురువారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీ (Delhi) ఏఐసీసీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rajhul Gandhi), ఖర్గే సమక్షంలో వైఎస్సార్టీపీని (Ysrtp) కాంగ్రెస్ (Congress) లో విలీనం చేశారు. ఖర్గే ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత హస్తం పార్టీది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. నేను వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాను.' అని షర్మిల పేర్కొన్నారు.


అండమాన్ లోనైనా పని చేస్తా


వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ ఓ భాగమని, కార్యకర్తలు, నేతలు, అభిమానులు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల మేరకు పని చేస్తారని చెప్పారు. 'మణిపూర్ లో హింస చాలా బాధ కలిగించింది. ఈ పరిస్థితులు మారాలంటే దేశంలో సెక్యులర్ పార్టీ అధికారంలోకి రావాలి. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడి పని చేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నేనూ నడుస్తాను. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాం. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అధిష్టానం ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్ లో పని చేయడానికైనా సిద్ధం.' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. 


షర్మిలకు ఏ బాధ్యతలు..?


కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు అప్పగించే బాధ్యతలపై ఆసక్తి నెలకొంది. ఏఐసీసీలో పదవి ఇస్తారా.? లేదా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే, షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్‌ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన,  మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ, అదే జరిగితే ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో, వైసీపీ తరఫున ఆమె పాదయాత్ర చేసి తన అన్న జగన్ కు అండగా నిలిచారు. అనంతరం తెలంగాణలో పార్టీని స్థాపించి ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.


Also Read: BRS Vs TRS : బీఆర్ఎస్‌గా పేరు మార్చేసి తెలంగాణనే ఎజెండా అంటే నమ్ముతారా ? - లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ ముందు అసలు సవాల్!