Trump Target Venezuela Maduro : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించడం వెనుక దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన వివాదాలు ఉన్నాయి. ఒకవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ అని అమెరికా వాదిస్తుంటే, మరోవైపు వెనిజులాలోని అపారమైన చమురు నిల్వల కోసమే అగ్రరాజ్యం ఈ కుట్రకు పాల్పడిందనే బలమైన విమర్శలు కూడా ఉన్నాయి.
మదురోపై అమెరికా ఆగ్రహానికి చాలా కారణాలు
వెనిజులాలో చాలా కాలంగా నికోలస్ మదులో అధికారాన్ని చెలాయిస్తున్నారు. మదురో తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని అమెరికా ఆరోపిస్తోంది. ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టడం, మీడియాను అణచివేయడం వంటి చర్యల ద్వారా వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అమెరికా వాదన. మదురోను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా గతంలోనే నిరాకరించింది. మదురో ప్రభుత్వం అమెరికాలోకి టన్నుల కొద్దీ కొకైన్‌ను సరఫరా చేస్తోందని, డ్రగ్ కార్టెల్స్‌తో చేతులు కలిపి నార్కో-టెర్రరిజం కు పాల్పడుతోందని అమెరికా న్యాయశాఖ అధికారికంగా అభియోగాలు మోపింది. మదురో తలపై 50 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించడానికి ఇది ఒక ప్రధాన కారణం. అదే సమయంలో అమెరికాకు బద్ధశత్రువులైన రష్యా, చైనా, మరియు ఇరాన్‌లతో మదురో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అమెరికా గుమ్మం వద్దే అంటే లాటిన్ అమెరికాలో రష్యా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి మదురో సహకరిస్తున్నారని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పు అని అమెరికా భావిస్తోంది. చమురు సంపదపై కన్ను పడిందని ఆరోపణ
అయితే ట్రంప్ మదురోను టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం చమురు అనే విమర్శ అంతర్జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తోంది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. సౌదీ అరేబియా కంటే ఎక్కువగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. ఈ నిల్వలపై పట్టు సాధిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్‌ను శాసించవచ్చని అమెరికా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతుంటారు. గతంలో హ్యూగో చావెజ్, ఆ తర్వాత మదురో అక్కడి చమురు బావులను జాతీయీకరించారు. దీనివల్ల అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా నష్టపోయాయి. అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కూర్చోబెడితే, మళ్లీ అమెరికా కంపెనీలు వెనిజులా చమురును నియంత్రించవచ్చనే కుట్రతోనే మదురోను బంధించారని అంటున్నారు.
అమెరికా ఆంక్షలతో ఇప్పటికే ఆర్థిక చిక్కుల్లో వెనిజులా
అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల వెనిజులా చమురును అమ్ముకోలేక ఆర్థికంగా కుప్పకూలిపోయింది. ప్రజల్లో అసంతృప్తి పెంచి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా ఈ ఆకలి యుద్ధం చేసిందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా ఈ చర్యను ప్రజాస్వామ్య పునరుద్ధరణ గా అభివర్ణిస్తుండగా, మదురో మద్దతుదారులు దీనిని ఆయిల్ కోసం ఆక్రమణ అని పిలుస్తున్నారు. ట్రంప్ హయాంలో జరిగిన ఈ మెరుపు దాడి, భవిష్యత్తులో లాటిన్ అమెరికా రాజకీయాలను, ప్రపంచ చమురు ధరలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.