Morocco : 2030లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్‌(Fifa World Cup)కు ముందు మొరాకో దాదాపు 30 లక్షల కుక్కలను చంపాలని యోచిస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ అనే మూడు దేశాలలో జరగనున్న తదుపరి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం మొరాకోలోని పలు నగరాలు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగా ఫుట్‌బాల్ అభిమానులకు మరింత అందంగా కనిపించేలా చేయడానికి కుక్కలను వధించడం 'క్లీన్-అప్' ప్రక్రియగా చేపట్టబోతున్నాయి. ఈ చర్యపై జంతు ప్రేమికులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రూరమైన, దిగ్ర్భాంతికరమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశంలోని ప్రదేశాలలోనూ కుక్కలను వధించడం ప్రారంభించిందని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. 

వీధి కుక్కలను అంతమొందించాలనే ప్రణాళికపై స్పందించిన ప్రసిద్ధ జంతు హక్కుల ప్రచారకర్త అయిన జేన్ గూడాల్, అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో కలిసి సమస్యను లేవనెత్తారు. ఇది కలవరపెట్టే పరిణామమని, తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలు క్రూరమైన, అనాగరికమైనవని ఖండిస్తూ, వెంటనే చర్య తీసుకోవాలని డాక్టర్ గూడాల్.. ఫిఫాకు లేఖ రాశారు.

పెస్టిసైడ్‌గా ఉపయోగించే అత్యంత విషపూరిత రసాయనమైన స్ట్రైక్‌నైన్‌తో కుక్కలను చంపేయనున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు, మొరాకోలోని అధికారులు 2024లో వధ ఆగిపోయిందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, ఉత్తర ఆఫ్రికా దేశానికి హోస్టింగ్ హక్కులను ఇస్తున్నట్లు ఫిఫా 2023 ప్రకటన తర్వాత కుక్కల వధలో పెరుగుదలను కొన్ని కథనాలు సూచించాయి. 

మొరాకోలో కుక్కలను ఎలా చంపుతున్నారంటే..

మొరాకో అంతటా ఇప్పటికే వేల సంఖ్యలో వీధికుక్కలు చంపారని, మరెన్నో కుక్కలకు ముప్పు పొంచి ఉన్నాయని జంతు సంక్షేమ సంస్థలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ యానిమల్ కోయలిషన్ కొన్ని క్రూరమైన పద్ధతుల గురించి తెలిపింది. ఇందులో స్ట్రైక్నైన్‌తో విషప్రయోగం, కాల్పులు వంటి ఉన్నాయి. కుక్కలను బిగించే పరికరాలతో బంధించి వాటిని అమానవీయంగా చంపి, రవాణా చేస్తారు. ఇందులో చాలా జంతువులు గాయపడిన తర్వాత తీవ్రమైన నొప్పితో చనిపోతాయని సంస్థ పేర్కొంది.

మొరాకో అగ్లీ సీక్రెట్

అంతర్జాతీయ జంతు కూటమి (International Animal Federation) ఈ హత్యలను నివారించేందుకు 'మొరాకోస్ అగ్లీ సీక్రెట్(Morocco's ugly secret)' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. 2024 ఆగస్టులో హత్యలు ఆగిపోయాయని ఫిఫాకి మొరాకో హామీ ఇచ్చినప్పటికీ, అవి ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని పేర్కొంది. హత్యలు పెరగడం, అంతర్జాతీయ దృష్టి పెరగడంతో, ఈ అమానవీయ పద్ధతులపై చర్య తీసుకోవాలనే పిలుపులు తీవ్రమవుతున్నాయి. ఫిఫా, మొరాకో అధికారులు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిరక్షకులు, జంతు ప్రేమికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. Also Read : Apple CEO Tim Cook : ఆపిల్ సీఈవో తండ్రి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్ - పోడ్‌క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో టిమ్ కుక్ వెల్లడి