Vivek Ramaswamy: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి వేగంగా పుంజుకుంటున్నారు. ట్రంప్ తర్వాత వివేక్ రామస్వామి రెండో స్థానానికి చేరుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హాంప్‌షైర్ నిర్వహించిన పోల్ లో.. డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో నిలవగా.. వివేక్ రామస్వామి రెండో స్థానానికి ఎగబాకారు. మూడో స్థానంలో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు. 


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్నారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్ ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి ముందుకు దూసుకుపోయారు.


డొనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాథమిక ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అభ్యర్థిత్వ రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థానానికి పడిపోయారు. డొనాల్డ్ ట్రంప్ కు రిపబ్లికన్ పోలింగ్ లో ఆధిక్యత లభించినప్పటికీ.. జాతీయ స్థాయిలో మాత్రం ట్రంప్ పనితీరు కాస్త వెనబడిందని నివేదికలు చెబుతున్నాయి.


ఆగస్టులో జరిగిన డిబేట్ తర్వాత రోన్ డిశాంటిస్ ఒక్కో మెట్టు దిగజారుతూ వస్తున్నారు. మరోపక్క పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కాలిఫోర్నియా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండూ మూడు స్థానాలకు చేరుకున్నారు. 13 శాతం జీవోపీ మద్దతుదారులతో రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉండగా 12 శాతంతో నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రోన్ డిశాంటిస్ 26 శాతం మద్దతుతో డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చి.. ప్రస్తుతం 6 శాతానికి పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు. 


షెడ్యూల్ ప్రకారం 2024 నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఆ లోగా పరిస్థితులు మారే అవకాశాలు చాలానే ఉన్నాయి. ట్రంప్ మరింత పుంజుకోవచ్చు. లేదా భారత సంతతి అభ్యర్థులు అధ్యక్ష రేసులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ట్రంప్ కు భారత సంతతి అభ్యర్థులు కంగారు పెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. 


ఎవరీ వివేక్ రామస్వామి?


37 ఏళ్ల వివేక్ రామస్వామి బయోటెక్నాలజీలో ఎక్స్‌పర్ట్. అంతే కాదు. Woke, Inc.: Inside Corporate America’s Social Justice Scam అనే పుస్తకం రాశారు. నిజానికి...ఆయనకు పేరు తెచ్చి పెట్టింది ఈ పుస్తకమే. 2021 ఆగస్టులో పబ్లిష్ అయిన ఈ బుక్‌ సంచలనం సృష్టించింది. అమెరికాలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీంతో పాటు మరో పుస్తకమూ రాశారు వివేక్. అది కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. వివేక్ తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఓహియోలో స్థిరపడ్డారు. వివేక్ బాల్యమంతా అక్కడే గడిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో బ్యాచ్‌లర్ డిగ్రీ చేశారు. యేల్ లా స్కూల్‌లో లా చదువుకున్నారు. ఓహియోలోని జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ ప్లాంట్‌లో ప‌ని చేసిన ఆయన...ఆ తరవాతే వ్యాపారం వైపు కదిలారు. 2014లో రోయివాంట్ సైన్సెస్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు వివేక్. ఎన్నో వ్యాధుల‌కు ఈ ఫార్మ‌సీ కంపెనీ మందుల్ని త‌యారు చేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఆ ఉత్ప‌త్తుల‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌తో పాటు గుర్తింపు కూడా ఉంది. రోయివాంట్‌తో పాటు మ‌రికొన్ని హెల్త్‌కేర్, టెక్నాల‌జీ కంపెనీల‌నూ స్థాపించారు. 2022లో Strive Asset Management సంస్థను ప్రారంభించారు. ప్రజల్లో రాజకీయాల పట్ల అవగాహన కల్పించడం సహా...వాళ్ల గొంతుకను వినిపించడమే లక్ష్యంగా ఈ కంపెనీ పెట్టారు వివేక్ రామస్వామి. 2016లో అమెరికాలోనే 40 ఏళ్ల లోపు అత్యంత సంపన్నమైన వ్యాపారుల్లో 24వ వ్యక్తిగా నిలిచారు. అప్పటికే ఆయన సంపద 600 మిలియన్ డాలర్లుగా ఉంది.