Nepal Plane Crash Video:
వైరల్ అవుతున్న వీడియో..
నేపాల్‌లోని పొఖారా విమానాశ్రయంలో విమానం కుప్ప కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 40 మంది మృతదేహాలు వెలికి తీసినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో 72 మంది ఫ్లైట్‌లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే...ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. క్రాష్ అయ్యే ముందు ఓ వ్యక్తి తన ఇంటి డాబాపై నిలబడి
వీడియో తీసినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరగబోయే ఓ 15 సెకన్ల ముందు ఫ్లైట్ ఎలా అదుపు తప్పిందో ఈ వీడియోలో కనిపించింది. అన్ని చోట్లా ఈ వీడియో షేర్ అవుతున్నా...ఇది నిజమా కాదా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. విమానం గాల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఓ పక్కకు పూర్తిగా ఒరిగిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనబడింది. ఆ తరవాత పెద్ద శబ్దం కూడా వినిపించింది. ఈ ప్రమాదం జరిగిన
తరవాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. సహాయక చర్యలపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిజానికి...హోం మంత్రితో పాటు ప్రధాని ఘటనా స్థలానికి వస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తరవాత ఉన్నట్టుండి వాళ్లు రావడం లేదని మరో ప్రకటన చేసింది ప్రభుత్వం.
సహాయక చర్యలు ముమ్మరం..
ఈ 72 మందిలో 68 మందిప్రయాణికులు కాగా..మిగతా నలుగురు విమాన సిబ్బంది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య ఫ్లైట్ క్రాష్ అయినట్టు Yeti Airlines వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా
పొఖారా విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ప్రాథమిక విచారణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణం కాదని తేలింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం సంభవించినట్టు తేలింది. ప్రయాణికుల్లో 5గురు భారతీయులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. క్రాష్ అయ్యే ముందు ఫ్లైట్‌లో నుంచి మంటలు వచ్చాయని వెల్లడించారు. పైగా ఈ విమానాన్ని దాదాపు 15 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. ప్రమాదానికి ఇది కూడా ఓ కారణం కావచ్చని భావిస్తున్నారు.
Also Read: Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్ ఫాలో అవుతున్న పోలీసులు