అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి రేసులో తాజాగా మరో ప్రవాస భారతీయుడు చేరారు. 38 ఏళ్ల భారతీయ-అమెరికన్ ఇంజనీర్ హర్ష్ వర్ధన్ సింగ్, రాబోయే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద నమోదు చేసుకున్నారు. దీంతో అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న మూడో ప్రవాస భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు నిక్కీ హేలీ(51), వివేక్‌ రామస్వామి(37) బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం.  


ఈ మేరకు ట్విట్టర్‌లో ఉద్వేగభరితమైన 3 నిమిషాల వీడియో సందేశాన్ని హర్ష్ సింగ్ పంచుకున్నారు. తనను తాను "జీవితకాల రిపబ్లికన్", దృఢమైన "అమెరికా ఫస్ట్" సంప్రదాయవాదిగా ప్రకటించుకున్నాడు. న్యూజెర్సీ రిపబ్లికన్ పార్టీలో సంప్రదాయవాద విభాగం పునరుద్ధరణకు నాయకత్వం వహించడంలో  గత ప్రయత్నాలను ప్రధానంగా వివరించారు. ఇటీవల కాలంలో సంభవించిన మార్పులను తిప్పికొట్టడానికి, ప్రాథమిక అమెరికన్ విలువలను పునరుద్ధరించడానికి బలమైన నాయకత్వం అవసరమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.  


సింగ్ రాజకీయ ప్రయత్నాలు అంత సులువుగా ఏమీ లేవు. అతను 2017, 2021లో న్యూజెర్సీ గవర్నర్, 2018లో హౌస్ సీటు, 2020లో సెనేట్ సీటు కోసం రిపబ్లికన్ ప్రైమరీలలో పోటీ చేశారు. ఆ సందర్భాలలో రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను పొందడంలో అతను విఫలమయ్యాడు. గవర్నర్ పదవి కోసం ఇటీవలి బిడ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగుతూ, మరింత సాంప్రదాయక ప్రత్యామ్నాయంగా తనను తాను నిరూపించుకున్నారు. చివరికి అనూహ్యంగా నామినేషన్ రేసులో మూడవ స్థానంలో నిలిచాడు, జాక్ సియాటరెల్లి నామినీగా ఉద్భవించాడు.


అధ్యక్ష పదవి అభ్యర్థిగా సింగ్ ప్రకటించుకోవడంలోను తన ప్రత్యేక వైఖరిని ప్రదర్శించారు. తనను తాను "ఓన్లీ ప్యూర్‌బ్లడ్ అభ్యర్థి" అని పేర్కొన్నాడు.  అయితే 2024 నామినేషన్ కోసం రిపబ్లికన్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఇందులో భారత సంతతికి చెందిన మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి వంటి ఉన్నత స్థాయి అభ్యర్థులు ఉన్నారు. చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మరో సారి అమెరికా పీఠం దక్కించుకోవడానికి రేసులో ఉన్నారు.  


రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జూలై 15 నుంచి 18, 2024 వరకు విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరగనుంది. ఇందులో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల కోసం అధికారికంగా తన నామినీని ఎంపిక చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న సింగ్, ఇతరులు దార్శనికతలను ప్రదర్శించడానికి ఇది వేదిక అవుతుంది. వారి ఆలోచన, మాటల ద్వారా ఇతర మద్దతు సాధించడం ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. హర్ష్‌సింగ్ పేరు బలమైన పోటీ ఉన్న మాజీ క్రాన్స్టన్, రోడ్ ఐలాండ్ మేయర్ స్టీవ్ లాఫీ, మిచిగాన్ వ్యాపారవేత్త ఫెర్రీ జాన్సన్, టెక్సాస్ పాస్టర్ ర్యాన్ బింక్లే వంటి బలమైన వ్యక్తులతో కూడిన అభ్యర్థుల జాబితాలో ఉంది.