Donald Trump: ట్రంప్ షాకింగ్ టారిఫ్ వ్యూహం: సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!
Donald Trump: ఫిబ్రవరి 20, 2026న అమెరికా సుప్రీంకోర్టు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన సుంకాల జీవోను కొట్టేసింది. దీనిపై స్పందించిన ఆయన అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయానికి తప్పుపట్టారు.

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అత్యంత కీలకమైన టారిఫ్ నిర్ణయానికి అక్కడి సుప్రీంకోర్టు గట్టిగా షాక్ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాలను కోర్టు కొట్టేసింది. అయితే ఈ తీర్పుతో ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. తీర్పు వచ్చిన కొద్దిసేపటికే ఆయన తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరో చట్టం తీసుకొచ్చి కొత్తగా మరో పది శాతం గ్లోబల్ టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించి ప్రపంచవ్యాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టించారు.
సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది? ఎందుకు కొట్టేసింది?
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ఈ టారిఫ్‌లను విధించింది. సాధారణంగా ఈ చట్టాన్ని దేశం ఏదైనా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వాణిజ్యపరమైన సుంకాలు విధించడానికి ఈ చట్టాన్ని వాడటం అంటే అధ్యక్షుడు తన అధికార పరిధిని అతిక్రమించడమేనని కోర్టు అభిప్రాయపడింది.
అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన అధికారాలను వాణిజ్య విధానాల కోసం వాడటం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. ఇది ట్రంప్ సర్కారుకు ఒక రకంగా పెద్ద ఎదురు దెబ్బే అయినా ట్రంప్ దీనికి ముందే సిద్ధపడినట్టు తెలుస్తోంది.
న్యాయమూర్తులపై విరుచుకుపడ్డ ట్రంప్
సుంకాల నిర్ణయం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సుప్రీంకోర్టు న్యాయమూర్తులను దేశద్రోహులుగా అభివర్ణించారు. కోర్టు నిర్ణయంతో ఆగ్రహించిన ట్రంప్, తాను ఏమి చేయాలనుకుంటే అది చేయగలనని చెప్పుకొచ్చారు.
సుప్రీంకోర్టు నిర్ణయం "తీవ్ర నిరాశపరిచింది" అని ట్రంప్ మీడియా సమావేశంలో అభివర్ణించారు, యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టులోని కొంతమంది న్యాయమూర్తుల పట్ల తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. కోర్టు నిర్ణయాన్ని కూడా విమర్శించారు.
కోర్టులకు కోపం తెప్పించకుండా ఉండటానికి తాను ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా ఉన్నానని, కానీ ఇప్పుడు తనకు వేరే మార్గం లేదని ట్రంప్ అన్నారు. కోర్టు విదేశీ ప్రయోజనాలతో ప్రభావితమైందని ఆయన అన్నారు. "సుంకాలపై సుప్రీంకోర్టు నిర్ణయం చాలా నిరాశపరిచింది. కోర్టులోని కొంతమంది న్యాయమూర్తులకు దేశానికి మంచి చేసే ధైర్యం లేకపోవడం పట్ల నేను సిగ్గుపడుతున్నాను. న్యాయమూర్తులు థామస్, అలిటో, కవనాగ్‌కు దేశం పట్ల వారికి ఉన్న ప్రేమకు కృతజ్ఞతలు,అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను" అని ట్రంప్ అన్నారు.
విదేశీయులు సంవత్సరాలుగా మనల్ని దోచుకుంటున్నారు, ఈ నిర్ణయంతో వారు సంతోషంగా ఉన్నారు: ట్రంప్
"సంవత్సరాలుగా మనల్ని దోచుకుంటున్న విదేశీ దేశాలు చాలా సంతోషంగా ఉన్నాయి. వారు వీధుల్లో డ్యాన్స్ చేస్తున్నారు, కానీ వారు ఎక్కువ కాలం అలా చేయలేరు. నేను మీకు ఆ విషయాన్ని గట్టిగా చెప్పగలను. కోర్టులో ఉన్న డెమొక్రాట్లు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ వారు నో అని ఓటు వేస్తారు" అని ట్రంప్ అన్నారు.
ఆ న్యాయమూర్తులు మన దేశానికి అవమానం: ట్రంప్
"వారందరూ అమెరికాను బలంగా, ఆరోగ్యంగా, గొప్పగా మార్చే ఏ పనినైనా 'వద్దు' అని అంటున్నారు," అని ట్రంప్ అన్నారు. "నిజం చెప్పాలంటే, ఆ న్యాయమూర్తులు మన దేశానికి అవమానం. మీ కేసు ఎంత మంచిదైనా, ఈ కేసు మంచిది కాదు. ఈ కోర్టులోని కొంతమంది సభ్యుల విషయంలో ఇది చాలాసార్లు జరిగింది."
ఆయన పెద్ద దేశద్రోహి: ట్రంప్
"ఈ కోర్టుకు ఇది చాలాసార్లు జరిగిందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ముఖ్యంగా ఓటింగ్ విషయానికి వస్తే ఎంత సిగ్గుచేటు. వాస్తవానికి, వారు RINOలు, రాడికల్-లెఫ్ట్ డెమొక్రాట్లకు సానుభూతిపరులు. వారు అతిపెద్ద దేశద్రోహులు, మన రాజ్యాంగానికి నమ్మకద్రోహులు."
కొంతమంది న్యాయమూర్తులు భయపడుతున్నారు, మంచి చేయాలనుకోవడం లేదు: ట్రంప్
"విదేశీ ప్రయోజనాలు, ప్రజలు అనుకున్న దానికంటే చాలా చిన్న రాజకీయ ఉద్యమం కోర్టును ప్రభావితం చేసిందని నా అభిప్రాయం. ఇది ఒక తత్కాలికమే. నేను లక్షల ఓట్లతో గెలిచాను. మేము భారీ మెజారిటీతో గెలిచాం. మేము ఇప్పటికీ భారీ మెజారిటీతో ఉన్నాం. కానీ ఈ వ్యక్తులు దుష్టులు, అజ్ఞానులు ఏదో చేయాలని చూస్తున్నారు. వారు చాలా గట్టిగా మాట్లాడతున్నరు. దీనికి కొంతమంది న్యాయమూర్తులు భయపడుతున్నారని నేను భావిస్తున్నాను. దేశానికి మంచి చేయకుండా అడ్డుకుంటున్నారు."
ట్రంప్ కొత్త ప్లాన్- సెక్షన్ 122తో టారిఫ్‌లు
సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైన వెంటనే ట్రంప్ స్పందించారు. "కోర్టు తీర్పు ఎలా ఉన్నా, మన దేశాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ 1974 నాటి ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122 కింద మరో పది శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు.
సెక్షన్ 122 అంటే ఏంటీ?
ఇది అధ్యక్షుడికి ఉన్న ఒక ప్రత్యేక అధికారం. దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటును అంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే ఆర్థిక సమస్యలు తగ్గించడానికి 15 శాతం వరకు సుంకాలు విధించడానికి అనుమతి ఉంది. అయితే దీనికి కూడా చిన్ని ఇబ్బంది ఉంది. ఇది కేవలం 150 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దాన్ని పొడిగించాలంటే అమెరికా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. ఇది తాత్కాలికమే అయినా ట్రంప్ తన ట్రేడ్ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు.























