వాషింగ్టన్: అమెరికా- ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారని పలు దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ తాజాగా క్యాథలిక్ పోప్ లియో (Pope Leo XIV)ను టార్గెట్ చేసుకున్నారు. పోప్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ, నేరాలకు వ్యతిరేకమైన విషయంలో ఆయన చాలా వీక్ అని విమర్శించారు. ఆయనకు నేరాలంటే చాలా ఇష్టమని, అందుకు ఇరాన్ అణ్వాయుధ ప్రక్రియను వ్యతిరేకించడం లేదంటూ మండిపడ్డారు. పోప్ లియో నేరాల విషయంలోనే కాకుండా, విదేశాంగ విధానం పరంగా కూడా చాలా బలహీనంగా ఉన్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ పరిపాలన పట్ల భయం గురించి పోప్ మాట్లాడుతున్నారు. కానీ కోవిడ్ సమయంలో క్యాథలిక్ చర్చిలు, క్రైస్తవ సంస్థలు అనుభవించిన భయం గురించి పోప్ లియో ప్రస్తావించడం లేదని ట్రంప్ అన్నారు. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించినందుకు, బయట 10-20 అడుగుల దూరం పాటించినప్పటికీ పాస్టర్లు, మంత్రులు, ఇతరులను అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు.
పోప్ సోదరుడంటే అమెరికా అధ్యక్షుడికి ఇష్టం‘నాకు పోప్ లియో) సోదరుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లూయిస్ పూర్తిగా MAGA (Make America Great Again) మద్దతుదారుడు. లూయిస్‌కు విషయాలు బాగా అర్థమవుతాయి. కానీ లియోకు ముఖ్యమైన విషయాలు సైతం అర్థం కావు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండటాన్ని సమర్థించే పోప్ నాకు అవసరం లేదు. నేరాలంటే ఇష్టపడే వ్యక్తి పోప్‌గా ఉండకూడదు. వెనిజులాపై అమెరికా దాడి చేయడం తప్పని భావించే పోప్ నాకు వద్దు. వెనిజులా భారీ మొత్తంలో డ్రగ్స్‌ను అమెరికా దేశానికి పంపిస్తోంది. వెనిజులా అక్కడి ఖైదీలను, హంతకులను, డ్రగ్ డీలర్లను అమెరికాలోకి పంపిస్తోందని’ ట్రంప్ పేర్కొన్నారు.
పోప్ లియో గురించి ట్రంప్ ఏమన్నారు?పోప్ లియో తమ పట్ల కృతజ్ఞతతో ఉండాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పోప్ అయ్యే జాబితాలో ఆయన పేరు ఎక్కడా లేదని, ఆయన ఒక అమెరికన్ కాబట్టే చర్చి ఆయనను పోప్‌గా ఎంపిక చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను వైట్ హౌస్‌లో లేకపోయి ఉంటే, లియో వాటికన్‌లో ఉండేవారు కాదని పేర్కొన్నారు.
పోప్ లియో XIV తన బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారని అనుకోవడం లేదు. పరిస్థితి గమనిస్తే ఆయనకు నేరాలంటే ఇష్టం అనిపిస్తోంది. అణు ఆయుధాలు కలిగి ఉండటం సరైనదేనని చెప్పే పోప్ మాకు అక్కర్లేదు. నేరాలు పెరిగినా పర్వాలేదని చెప్పే పోప్ మాకు వద్దు. అంటి పోప్ నాకు ఎన్నటికీ నచ్చరు. నేను పోప్ లియోకు అభిమానిని కాదు. ఆయన చాలా ఉదారవాద వ్యక్తి. నేరాలను అదుపు చేయాలని భావించని మనిషి ఆయన. ప్రపంచాన్ని నాశనం చేయడానికి అణ్వాయుధాలు కావాలనుకునే దేశంతో మనం పోరాటం చేయకూడదని ఆయన భావిస్తున్నారు. అందుకే నాకు పోప్ లియో అంటే ఇష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు.
లియో ఒబామా మద్దతుదారుడైన డేవిడ్ ఆక్సెల్‌రోడ్‌ను కలవడం కూడా నచ్చలేదని ట్రంప్ అన్నారు. ఆక్సెల్‌రోడ్ ఒక ఓడిన వామపక్షవాది అని, ఆయన చర్చికి వెళ్లేవారిని, పాస్టర్లను అరెస్టు చేయాలని కోరుకునే వ్యక్తి అని విమర్శించారు. లియో తీవ్ర వామపక్షవాదులను సంతోషపెట్టడానికి బదులుగా, ఒక గొప్ప పోప్‌గా ఉండటంపై ఫోకస్ చేయాలని ట్రంప్ సూచించారు.
