UN Human Rights Prize:
మహసా అమినికి అవార్డు..
ఇరాన్‌లో హిజాబ్‌కి వ్యతిరేకంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో మొదలైన ఈ ఉద్యమం ఒక్కసారిగా ఉద్ధృతమైంది. అందుకు కారణం..22 ఏళ్ల యువతి పోలీస్ కస్టడీలో మృతి చెందడం. హిజాబ్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్న మహసా అమినిని (Mahsa Amini)మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై మహిళలంతా భగ్గుమన్నారు. మొరాలిటీ పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. హిజాబ్‌లు కాల్చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనకు మద్దతు లభించింది. ఈ క్రమంలోనే మహసా అమినికి ఐరోపా సమాఖ్య ( European Union Human Rights Prize) హ్యూమన్ రైట్స్ ప్రైజ్ ప్రకటించింది. సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా ఉద్యమించిన ఆండ్రీ సకరోవ్‌కి ( Andrei Sakharov) గుర్తుగా ఐరోపా సమాఖ్య ఈ అవార్డుని బహుకరించడం మొదలు పెట్టింది. 1988 నుంచి ఈ అవార్డులు ఇస్తోంది. సకరోవ్‌కి 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల కోసం పోరాడిన వాళ్లకి ఇలా సత్కరిస్తోంది. ఈ సారి మహసా అమినికి ఈ అవార్డు ప్రకటించింది.
16 ఏళ్ల యువతిపైనా దాడి..
ఇరాన్‌లో హిజాబ్ వివాదం ఇంకా సమసిపోలేదు. ఎక్కడో ఓ చోట హిజాబ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. వేలాది మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయినా ఉద్యమం ఆగడం లేదు. ఇటీవలే ఓ 16 ఏళ్ల అమ్మాయిపై దారుణమైన దాడి జరిగింది. హిజాబ్‌ని వ్యతిరేకిస్తున్నందుకు మెట్రోలనే ఆమెపై దాడి చేశారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. భారీ భద్రత మధ్య ఆమెకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా మొరాలిటీ పోలీసుల పనే అని అక్కడి ఉద్యమ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. బాధితురాలి పేరు అర్మిత గరవంద్. మెట్రోలో ప్రయాణిస్తుండగా మహిళా పోలీసులతో వాగ్వాదం జరిగింది. హిజాబ్ ధరించాలని పోలీసులు పట్టుబట్టినట్టు సమాచారం. అందుకు అర్మిత అంగీకరించలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. కానీ...పోలీసులు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. ఆమె లో బీపీ కారణంగా కళ్లు తిరిగి పడిపోయిందని, ఇందులో తమ జోక్యం ఏమీ లేదని తేల్చి చెబుతున్నారు. దాదాపు ఏడాదిగా ఇరాన్‌లో ఇవే గొడవలు జరుగుతున్నాయి.