Trump On Iran: ఖమేనీ ప్రభుత్వంపై తిరగబడండి - ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపు
Trump: ఇరాన్ పై సంయుక్త దాడులు చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ , అమెరికా ప్రకటించాయి. ప్రజలు ఖమేనీపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.

Trump says attacks on Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ, ఇరాన్ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఈ యుద్ధంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఒప్పుకుంటూనే, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈ ఉదాత్తమైన కార్యానికి సిద్ధమైనట్లు ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలకు ఇది విముక్తి కలిగించే చారిత్రక సందర్భమని ఆయన అభివర్ణించారు.
"ఈ యుద్ధంలో మన అమెరికన్ హీరోల ప్రాణాలు కోల్పోవచ్చు , మనకు ప్రాణనష్టం జరగవచ్చు, యుద్ధాల్లో ఇది తరచుగా జరుగుతుంటుంది. కానీ మేము దీనిని భవిష్యత్తు కోసం చేస్తున్నాము. మేము ఈ పనిని ముగించిన తర్వాత, మీ ప్రభుత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. తరతరాలకు మీకు లభించే ఏకైక అవకాశం బహుశా ఇదే కావచ్చు... అమెరికా అపారమైన బలంతో మరియు విధ్వంసకర శక్తితో మీకు అండగా నిలుస్తోంది. చర్య తీసుకోవాల్సిన సమయం ఇదే. దీనిని వదులుకోకండి..." అని ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇరాన్ పౌరులు తమ దేశ పగ్గాలను చేపట్టాలని, ఇది వారికి లభించిన ఏకైక గొప్ప అవకాశమని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా తన పూర్తి సైనిక శక్తిని ప్రయోగించి అండగా ఉంటుందని, తక్షణమే తమ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, ఇప్పుడే చర్య తీసుకోవాలని ఆయన ప్రజలను ప్రేరేపించారు. అదే సమయంలో ఇరాన్ భద్రతా దళాలకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే ఆయుధాలు విడిచిపెట్టాలని, అలా చేస్తే వారికి రక్షణ కల్పిస్తామని, లేనిపక్షంలో మరణం తప్పదని స్పష్టం చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాలను, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా తుడిచిపెట్టడమే అమెరికా లక్ష్యమని ఆయన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
తమ ప్రభుత్వంపై తిరగబడాలని ఇరాన్ ప్రజలను ప్రేరేపిస్తూ, దశాబ్దాలుగా వారు కోరుకుంటున్న అంతర్జాతీయ మద్దతును అందించే ఏకైక అధ్యక్షుడు తానేనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సైనిక చర్యల ద్వారా ఇరాన్ అణచివేత శక్తులను నిర్వీర్యం చేస్తామని, ఆ తర్వాత ప్రజలు తమ సొంత భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన కోరారు. ఇరాన్ అణు కేంద్రాలు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
Donald Trump promete al pueblo iraní que su libertad está cerca y que EE. UU. usará su fuerza devastadora para ayudarlos a retomar el control de su gobierno.
— Jasesmi i𝕏 (@jasesmi) February 28, 2026
Les insta a actuar ahora, asegurando que él es el único presidente dispuesto a darles el respaldo que han pedido por… pic.twitter.com/EqiG53aM5P
ప్రస్తుతం టెహ్రాన్ సహా పలు నగరాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఒక భారీ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి, దీని ప్రభావం ప్రపంచ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.























