కరేబియన్ దేశమైన హైతీలో శనివారం ఘోరమైన భూకంపం సంభవించింది. రాత్రిపూట వచ్చిన ఈ భూకంపం అనంతరం అనేక భవనాలు కుప్పకూలాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 2800 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. పది కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
హైతీలో రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు 724 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు 125 కి.మీల దూరంలో, పశ్చిమ హైతీలోని సెయింట్ లూయిస్-డు-సుడ్‌కు 12 కి.మీల దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌తో పాటు సమీప దేశాల్లో భూప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. భూకంపం వచ్చిన తర్వాత దాదాపు ఆరు సార్లు భూమి కంపించినట్లు కూడా చెబుతున్నారు.
ఈ భూకంపంతో దేశంలోని పలు చోట్ల ప్రాణ, భారీ ఆస్తి నష్టాన్ని కలిగించినట్లు ఆ దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ తెలిపారు. భూప్రకంపనల ధాటికి పలు చోట్ల భవనాలు, వేల ఇళ్లు కుప్పకూలాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. గాయపడినవారిని విపత్తు, సహాయ బృందాలు సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లాయి. నెలరోజుల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించినట్లు ప్రధాని హెన్రీ తెలిపారు. హైతీకి సాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. నష్టాన్ని అంచనా వేసేందుకు, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు యూఎస్ఏఐడీ కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే హైతీ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారని, ఇప్పుడు ఈ భూకంపం విధ్వంసం సృష్టించడం విచారకరమని బైడెన్ అన్నారు.
2010లో కూడా రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ దేశాన్ని కుంగదీసింది. 2 లక్షలకు పైనే మృతి చెందారు. దాదాపు 3 లక్షల మంది క్షతగాత్రులయినట్లు అంచనా. ఎక్కడికక్కడ భవనాలు కుప్పకూలాయి. అపార ఆస్తినష్టం కలిగింది. లక్షల్లో నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ దేశానికి ఇప్పుడు వచ్చిన భూకంపం మరో పిడుగులాంటిదే.