South Korea Declares Emergency | సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో అత్యవసర యుద్ధ చట్టాన్ని అమలు చేయడానికి మొగ్గు చూపారు. సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Emergency Martial Law) విధించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా ద్వారా మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నాయని, ఉత్తర కొరియాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రహించి అధక్షుడు దక్షిణ కొరియాలో సైనిక పాలన విధించారు.
ప్రధాన ప్రతిపక్షం కుట్రలు చేస్తోందన్న అధినేత
బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్ లో మొదలైన రగడ దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ మంగళవారం అత్యవసర యుద్ధ చట్టాన్ని అమలు చేయడానికి దారితీసింది. దేశంలో కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ‘ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ నేతల బెదిరింపుల నుంచి.. దక్షిణ కొరియాను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రజల స్వేచ్ఛను, వారి హక్కులను కాపాడేందుకు.. దేశ వ్యతిరేక శక్తుల ఆట కట్టించడానికి ఎమర్జెన్సీ మార్షల్ లా అమలు చేస్తున్నాం’ అని యూన్ సుక్ యోల్ జాతిని ఉద్దేశించి టీవీ ప్రసంగంలో ప్రకటన చేశారు.
పార్లమెంట్ నేరస్తులకు స్వర్గధామం
వచ్చే ఏడాది బడ్జెట్ బిల్లుపై అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. గత వారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటరీ కమిటీ ద్వారా భారీగా తగ్గించిన బడ్జెట్ ప్రణాళికను సైతం ఆమోదించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ ప్రతిపాదించిన 677 ట్రిలియన్ల బడ్జెట్ ప్లాన్ నుంచి ప్రతిపక్షం సుమారుగా 4.1 ట్రిలియన్ వోన్ ($2.8 బిలియన్) తగ్గించింది. ఈ క్రమంలో మన పార్లమెంట్ నేరస్తులకు స్వర్గధామంగా మారింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎమర్జెన్సీ మార్షల్ లా అమలు చేస్తున్నట్లు ప్రకటించి ప్రతిపక్షానికి షాకిచ్చారు. దాంతో దేశంలో అత్యవసరంగా సైనిక పాలన అమలులోకి వచ్చింది.
దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ 2022లో బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ప్రధాన ప్రతిపక్షం ఉత్తర కొరియా ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది. ఏకంగా పార్లమెంట్ లోనే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి నెలకొనడంతో అధ్యక్షుడు మార్షల్ లా అమలు చేశారు.