Office Washroom Death:కార్పొరేట్ క్రూరత్వం -సెలవు ఇవ్వని మేనేజర్లు.. ఆఫీస్ వాష్ రూమ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన 29 ఏళ్ల యువతి!
Corporate Pressure: దూరదృష్టి లేని కార్పొరేట్ నిబంధనలు ఓ యువతి ప్రాణం తీశాయి. సౌత్ ఆఫ్రికాలో అనారోగ్యంతో లీవ్ అడిగినా ఇవ్వకపోవడంతో, 29 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగిని ఆఫీస్ వాష్ రూమ్‌లోనే శవమై తేలింది.

Corporate Pressure Office Washroom Death: కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులపై ఉండే పని ఒత్తిడి, యాజమాన్యాల మొండివైఖరి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందనడానికి సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, సెలవు కావాలని పదే పదే బతిమాలినా మేనేజర్లు లీవ్ ఇవ్వకపోవడంతో.. ఓ 29 ఏళ్ల మహిళా ఉద్యోగిని ఆఫీస్ వాష్ రూమ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. 'కార్‌ట్రాక్' అనే ప్రముఖ కంపెనీలో జరిగిన ఈ దారుణం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగింది?
సౌత్ ఆఫ్రికాలోని రోజ్‌బ్యాంక్‌లో ఉన్న కార్‌ట్రాక్ కంపెనీలో గ్సినా ద్లాద్లా అనే 29 ఏళ్ల యువతి కాల్ సెంటర్ ఏజెంట్‌గా పనిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. తనకు సెలవు కావాలంటూ డాక్టర్ రాసిన సిక్ నోట్స్‌ను కూడా మేనేజ్‌మెంట్‌కు సమర్పించింది. అయినా సరే, లీవ్ ఇచ్చేందుకు పైఅధికారులు నిరాకరించారు. అనారోగ్యంతో నీరసించిపోయినప్పటికీ ఆమెను బలవంతంగా విధులకు హాజరయ్యేలా ఒత్తిడి తెచ్చారు. చివరకు ఆఫీస్ వాష్ రూమ్‌కు వెళ్లిన గ్సినా అక్కడే స్పృహతప్పి పడిపోయి, కన్నుమూసింది.
కంపెనీయే నా స్నేహితురాలిని చంపేసింది: తోటి ఉద్యోగి ఆవేదన
గ్సినా మృతిపై ఆమెతో పనిచేసే ఒక ఉద్యోగి కన్నీటిపర్యంతమయ్యాడు. "శుక్రవారం నాడు ఆమె మోకాళ్లపై కూర్చుని ఏడుస్తూ.. 'నాకు ఒంట్లో అస్సలు బాలేదు, అయినా శనివారం కూడా నన్ను డ్యూటీకి రమ్మంటున్నారు' అని ఆవేదన చెందింది. బుధవారం సాయంత్రం టీమ్ లీడర్ ఆమెను క్యాబిన్‌లోకి పిలిచి మాట్లాడినప్పుడు కూడా ఆమె కళ్లద్దాలు తీసి ఎడ్చింది. కంపెనీ వైఖరే గ్సినా మరణానికి కారణం. చావును ఎవరూ ఆపలేరు, కానీ ఆమె ఒక టాయిలెట్ గదిలో అలా ఒంటరిగా చనిపోవాల్సింది కాదు. కనీసం కుటుంబ సభ్యుల మధ్య అయినా ప్రశాంతంగా ప్రాణాలు విడిచే అవకాశం లేకుండా చేశారు. ఆమెకు కనీస గౌరవం కూడా దక్కలేదు" అని తోటి ఉద్యోగి పేర్కొన్నాడు.
Alleged Cartrack Agent Dies At Work After She Was Denied Permission To Stay Home When She Reported Sick
— Crime_spotterSA (@Crime_SpotterSA) June 7, 2026
A tragic incident has sparked calls for accountability after an employee, identified as Gcina, allegedly passed away while on duty after reportedly informing management that… pic.twitter.com/IhQ2McCWiV
ఆసుపత్రి ఖర్చులు ఎవరు కడతారని చర్చించుకున్నారు: కుటుంబ సభ్యులు
గ్సినా అత్త నోముసా కంపెనీ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. "ఆమె గత కొద్దిరోజులుగా రెండు సిక్ నోట్లు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆఫీస్ ఎదురుగానే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా, నా మేనకోడలిని అక్కడికి తీసుకెళ్లకుండా.. హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరిస్తారు? అని మేనేజర్ చర్చలు జరిపారు. ప్రాణాలు కాపాడటం కంటే వారికి డబ్బులే ముఖ్యం అయ్యాయి. అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు కానీ, దానికి సంబంధించిన రిఫరెన్స్ నంబర్ కూడా వారి వద్ద లేదు. సరైన సమయంలో స్పందించి ఉంటే గ్సినా బతికేది" అని ఆమె ఆరోపించారు.
ఆరోపణలను తిరస్కరించిన కంపెనీ
అయితే ఈ ఆరోపణలను కార్‌ట్రాక్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ లారెన్ హ్యూమన్ తోసిపుచ్చారు. తాము వెంటనే స్పందించామని, ఆఫీసులో ఉన్న ఫస్ట్ రెస్పాండర్స్ డిఫిబ్రిలేటర్ సహాయంతో ప్రాథమిక చికిత్స అందించారని, అత్యవసర వైద్య సేవలను కూడా వెంటనే రంగంలోకి దించామని కంపెనీ సమర్థించుకుంది. ఏదేమైనా, ఈ ఘటన కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల ఆరోగ్యం, లీవ్ పాలసీలపై తీవ్ర చర్చకు దారితీసింది.
ట్రెండింగ్ వార్తలు






















