దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073 కాక్‌పిట్‌లో కో-పైలట్ హమామ్ అల్-హమామీ, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో కెప్టెన్ గాయపడ్డారు.
Flydubai Incident: ఫ్లైట్‌లో దాడి ముందస్తు పథకమా ? కో పైలట్ విమానాన్ని కూల్చేయాలని ఎందుకు చూశాడు? టెర్రర్ లింక్స్
ఫ్లైదుబాయ్ కో-పైలట్ హమామ్ అల్-హమామీ పాత సోషల్ మీడియాలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న వ్యక్తుల ఫోటోలు పోస్ట్ చేసినట్లు నివేదికలు వస్తున్నాయి.

- ఫ్లైదుబాయ్ కో-పైలట్ భారతీయ కెప్టెన్‌పై విమానంలో దాడి చేశాడు.
- దర్యాప్తులో అల్-ఖైదా అనుబంధ ఫోటోలు, అనుమానాస్పద పోస్ట్‌లు వెల్లడయ్యాయి.
- ఒమన్ ఎయిర్ గతంలో అతడిని తీవ్రవాద భావజాలం ఆందోళనలతో తొలగించింది.
- యు.ఎ.ఇ అటార్నీ జనరల్ ఉగ్రవాద కోణంలో ప్రత్యేక బృందం దర్యాప్తు మొదలుపెట్టింది.
ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి జరగడం కలకలం రేపింది. అది కూడా కో పైలట్ ఈ పని చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మచ్చర్‌పై దాడికి యత్నించిన కో-పైలట్ హమామ్ అల్-హమామీకి సంబంధించి పలు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం, అతడి పాత సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలనలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న వ్యక్తుల ఫోటోలు, ఇతర అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సమాచారం లభించాయి. యూఏఈ అటార్నీ జనరల్ ఈ ఘటనపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి, హైజాక్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నివేదికల ప్రకారం, హమామ్ అల్-హమామీ ఒమన్‌కు చెందిన పౌరుడు. అతడు యూఏఈ (UAE)లో జన్మించాడని కొన్ని నివేదికలు చెబుతుండగా.. అతని తండ్రి ఒమన్ పౌరుడని, తల్లి సిరియాకు చెందిన వ్యక్తి అని తెలిసింది. అతడు కొన్నేళ్లపాటు యూఏఈలో గడిపాడు. అతని పేరుతో ఉన్న లింక్డ్‌ఇన్ ప్రోఫైల్ ప్రకారం, ఒమన్ ఎయిర్‌లో దాదాపు ఏడేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత రాయల్ ఎయిర్ మరోక్ (Royal Air Maroc)తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఫ్లైదుబాయ్‌లో కో-పైలట్‌గా చేరి సేవలు అందిస్తున్నాడు.
ఒమన్ ఎయిర్‌లోనూ ప్రయాణికుల భద్రతపై ఆందోళన
సీఎన్ఎన్ (CNN) కథనం ప్రకారం, 2024లో నిందితుడు, కో పైలట్ హమామ్ అల్ హమామీని ఒమన్ ఎయిర్‌లో ఫ్లైట్ ట్రైనింగ్ నుంచి తప్పించారు. తీవ్రవాద భావజాలం వల్ల ఆకర్షితుడు అవుతున్నాడని అతడిపై అనుమానం వచ్చింది. దాంతో తలెత్తిన భద్రతా పరమైన ఆందోళనలే అతడ్ని తొలగించడానికి కారణమని సమాచారం. అతడిని ఎయిర్‌లైన్ నుంచి పూర్తిగా తొలగించకుండా ఇతర, నాన్-ఫ్లయింగ్ బాధ్యతలు అప్పగించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఆ సమయంలో అతని సమాచారాన్ని ఇతర ఎయిర్‌లైన్లు లేదా సంబంధిత దేశాల సంస్థలతో ఎంతవరకు పంచుకున్నారనే అంశంపై స్పష్టత లేదు.
సోషల్ మీడియాలో ఏం వివరాలు కనిపించాయి
సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, హమామ్‌కు సంబంధించిన సోషల్ అకౌంట్లలో కొన్ని అనుమానాస్పద ఫోటోలు, వీడియోలు లభించాయి. అందులో అల్-ఖైదాతో సంబంధం ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక వీడియోలో బోయింగ్ 737 మాక్స్ కాక్‌పిట్ నుంచి వేర్వేరు విమానాల రికార్డింగ్ కనిపిస్తుంది. వీడియో చివరలో అల్-ఖైదా మాజీ చీఫ్ ఐమన్ అల్-జవాహిరీ, 2009లో CIA అధికారుల హత్యతో సంబంధం ఉన్న హుమామ్ ఖలీల్ అబూ-ములాల్ అల్-బలావీల ఫోటోలు ఉన్నాయని గుర్తించారు. ఈ పోస్టులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రొఫైళ్లు తొలగించారు.
మక్కా, మదీనా, జెరూసలేంలకు చెందిన ఏఐ (AI) ఫొటో పోస్ట్
నివేదికల ప్రకారం, మరొక సోషల్ పోస్ట్‌లో ఏఐ సాయంతో తయారు చేసిన ఒక ఫొటో ఉంది. అందులో మక్కా, మదీనా, జెరూసలేంలను ఒక మెరుస్తున్న గీతతో కలిపాడు. దీంతో పాటు మరణం, అవమానానికి సంబంధించిన పదాలతో ఉన్న ఒక కవిత ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రమాదంతో నేరుగా సంబంధం ఉందో లేదో దర్యాప్తులో తేలనుంది.
మహిళలపై పాత పోస్టులు
సీఎన్ఎన్ నిపుణుల ప్రకారం, హమామ్ పాత, ఇప్పుడు తొలగించిన సోషల్ మీడియా పోస్టులలో మహిళల పట్ల కఠినమైన అభిప్రాయాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత భార్య ఉద్యోగం చేయకూడదని, నిఖాబ్ ధరించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. మరికొన్ని పోస్టులలో పురుషులు, మహిళలు కలసి పనిచేసే వర్క్ స్పేస్ లను పూర్తిగా వ్యతిరేకించాడు. సీఎన్ఎన్ 2021, 2022 నాటి దాదాపు 3,000 తొలగించిన పోస్టులను విశ్లేషించారు. ఈ పోస్టుల ద్వారా అతని వ్యక్తిగత, మతపరమైన ఆలోచనలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి సోషల్ మీడియా ఆలోచనలకు, ఒక నేర సంఘటనకు నేరుగా లింక్ ఉందా లేదా అనే కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో ఏం జరిగింది?
30 సెప్టెంబర్ 2026న ఫ్లైదుబాయ్ విమానం FZ1073 దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తుండగా కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య గొడవ జరిగింది. కో పైలట్ హమామ్ అల్ హమామీ దాడిలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ గాయపడ్డారు. యూఏఈ అధికారిక సమాచారం ప్రకారం, ఈ ఘటన తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్ పోర్ట్ వైపు మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, విమానంలో ఉన్న ఇతర క్రూ సభ్యులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తరువాత కెప్టెన్ స్మిత్ మచ్చర్ సురక్షితంగా యూఏఈకి తిరిగి రాగా, వైద్య చికిత్స కొనసాగుతోంది.
Frequently Asked Questions
ఫ్లైదుబాయ్ విమానంలో ఏమి జరిగింది?
కో-పైలట్ హమామ్ అల్-హమామీపై ఏ అనుమానాలు ఉన్నాయి?
అతని సోషల్ మీడియా అకౌంట్లలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న వ్యక్తుల ఫోటోలు, అనుమానాస్పద వీడియోలు లభించాయి. గతంలో ఒమన్ ఎయిర్ నుండి తీవ్రవాద భావజాలం కారణంగా తొలగించినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఎవరు దర్యాప్తు చేస్తున్నారు?
యూఏఈ అటార్నీ జనరల్ ఈ ఘటనపై ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు ఉగ్రదాడి, హైజాక్ కోణంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
కో-పైలట్ హమామ్ అల్-హమామీ గత ఉద్యోగ వివరాలు ఏమిటి?
అతను ఒమన్ ఎయిర్‌లో దాదాపు ఏడేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత రాయల్ ఎయిర్ మరోక్, అనంతరం ఫ్లైదుబాయ్‌లో కో-పైలట్‌గా సేవలు అందించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























