Pakistan requests IMF cheaper condoms : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం జనాభా నియంత్రణ సాధనాలపై పన్ను తగ్గింపు కోసం చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) తోసిపుచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను అదుపు చేసేందుకు, కండోమ్‌లు , ఇతర గర్భనిరోధక సాధనాలపై ఉన్న 18% జిఎస్‌టి (GST)ని తొలగించాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) తిరస్కరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ జనాభా వృద్ధి రేటు 2.55 శాతంగా ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. ఏటా దాదాపు 60 లక్షల మంది కొత్తగా జనాభాకు తోడవుతుండటంతో దేశ వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.
షెహబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఈ ప్రతిపాదనను IMF ముందు ఉంచిం ది. అయితే, కొనసాగుతున్న బెయిలౌట్ ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎటువంటి పన్ను మినహాయింపులు ఇవ్వడం కుదరదని IMF స్పష్టం చేసింది. ఇలాంటి మార్పులు చేస్తే రెవెన్యూ లక్ష్యాలు దెబ్బతింటాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చర్చల సమయంలో మాత్రమే దీని గురించి ఆలోచిస్తామని సంస్థ తెల్చిచెప్పింది. కండోమ్‌లతో పాటు శానిటరీ ప్యాడ్‌లు, బేబీ డయాపర్లపై కూడా పన్నులు తగ్గించాలని పాకిస్థాన్ కోరగా, వాటిని కూడా IMF తిరస్కరించింది. ఈ పన్ను మినహాయింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 40 నుండి 60 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఒకవైపు జనాభా విస్ఫోటనం దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంటే, మరోవైపు గర్భనిరోధక సాధనాలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడం పట్ల ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా IMF ఇచ్చే రుణాలపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే 3.3 బిలియన్ డాలర్ల నిధులను అందుకున్న పాకిస్థాన్, మరిన్ని నిధుల కోసం IMF విధించే కఠినమైన షరతులను పాటించక తప్పని పరిస్థితిలో ఉంది. పన్నుల పెంపు, సబ్సిడీల కోత వంటి చర్యల వల్ల సామాన్య ప్రజలపై భారతం పడుతున్నప్పటికీ, దేశం డిఫాల్ట్ కాకుండా ఉండాలంటే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.