పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఈరోజుకు గండం గట్టెక్కింది. ఇమ్రాన్ సర్కార్‌పై పార్లమెంటులో ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడతారని అంతా అనుకున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టకముందే పార్లమెంటును సభాపతి వాయిదా వేశారు. మార్చి 28న తీర్మానం పెట్టాలని నిర్ణయించారు.
అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే సమయంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 3 ప్రధాన భాగస్వామ పార్టీలు అధికార కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం చేశాయి. దీంతో అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సొంత పార్టీ సెగ
నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించే ఉద్యమానికి సహకరిస్తామని తేల్చిచెప్పాయి. మరోవైపు అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 24 మంది చట్టసభ్యులు అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించి ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతిస్తామని చెప్పిన మిత్రపక్షాలు కూడా హ్యాండ్ ఇచ్చాయి.
ప్రభుత్వ నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, విదేశాంగ విధానంలోనూ ఇమ్రాన్‌ఖాన్ విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు ఆర్మీ సపోర్ట్ ఉంది. ఈ కారణంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే ఏదో విధంగా గట్టెక్కుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెబల్ ఎంపీలను ఆర్మీ ద్వారా కిడ్నాప్ చేయించి తీసుకు రావడం లేదా ఇతర వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ ఆర్మీ పూర్తి స్థాయిలో సహకరించకపోతే.. ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ మధ్యలోనే క్లీన్ బౌల్డ్ అయినట్లవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఆర్మీ కూడా ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
ఎంత కావాలి?
మొత్తం 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. అయితే దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం ఉంచుకోగలిగింది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇమ్రాన్ ఖాన్ క్రికెట్‌లో చేసినట్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.
Also Read: Zomato Instant Delivery: జొమాటోకు పోలీసుల షాక్- 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీపై సీరియస్
Also Read: Birbhum Violence Case: బంగాల్ హింసాకాండపై సీబీఐ దర్యాప్తు- కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం