Balochistan Bus Accident : పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్‌లోని లాస్బెలాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 41 మంది మరణించారు. ఈ ప్రమాదాన్ని పాకిస్థాన్‌లోని అధికారులను ధృవీకరించారు. డాన్ లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హమ్జా అంజుమ్ సంఘటన వివరాలు తెలియజేశారు. దాదాపు 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు క్వెట్టా నుంచి కరాచీకి ప్రయాణిస్తోందని ఆయన చెప్పారు. అధిక వేగం కారణంగా లాస్బెలా సమీపంలో యు-టర్న్ తీసుకుంటుండగా బస్సు వంతెన పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు లోయలో పడిపోయి మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు అంటున్నారు.  






 మృతుల సంఖ్య పెరిగే అవకాశం 


ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి, మహిళతో సహా ముగ్గురిని రక్షించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హమ్జా అంజుమ్ తెలిపారు.  ఈధి ఫౌండేషన్‌కు చెందిన సాద్ ఈధి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు 17 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బలూచిస్థాన్ తాత్కాలిక గవర్నర్ మీర్ జాన్ ముహమ్మద్ జమాలీ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలూచిస్థాన్ గవర్నర్ హౌస్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేస్తూ, "లాస్బెలా సమీపంలో జరిగిన ప్రమాదంపై  బలూచిస్థాన్ తాత్కాలిక గవర్నర్ మీర్ జాన్ ముహమ్మద్ జమాలీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని వైద్య సదుపాయాలను అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సదుపాయాలు అందించాలన్నారు". 






మృతుల్ని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు 


ఈ ప్రమాదం తర్వాత బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతుల్ని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాకిస్థాన్‌లో  రోడ్లు, హైవేల మరమ్మతులు అవసరమైన చోటచేయకపోవడం, వాణిజ్య వాహనాలకు లైసెన్సులు, పర్మిట్లు మంజూరు చేసేటప్పుడు భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.