Osman Hadi brother warns Yunus: బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఇంక్విలాబ్ మంచా కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యోదంతంపై ఆయన సోదరుడు షరీఫ్ ఒమర్ బిన్ హదీ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఉత్కంఠ రేపుతున్న ఉస్మాన్ హదీ హత్య కేసులో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంపై బాధితుడి కుటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది. నా సోదరుడి హత్యకు ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఈ హత్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఫిబ్రవరిలో జరగబోయే సాధారణ ఎన్నికలను అడ్డుకోవడమే అని ఉస్మాన్ హదీ సోదరుడు షరీఫ్ ఒమర్ బిన్ హదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢాకాలో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదని, నేడు కాకపోయినా పదేళ్ల తర్వాతైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు. హీరోగా ఎదిగిన విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ, రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడి జరిగింది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలని నా సోదరుడు బలంగా ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. సరిగ్గా ఎన్నికల వాతావరణం నెలకొంటున్న సమయంలోనే ఆయనను అంతం చేయడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను విచ్ఛిన్నం చేయాలని కొందరు కుట్ర పన్నారు అని ఒమర్ ఆరోపించారు. ఈ హత్యను సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఎన్నటికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని హదీ కుటుంబం మండిపడింది. మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఈ హత్యను ఖండించి, యూనస్ ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై స్పీడీ ట్రయల్ ట్రిబ్యునల్ ద్వారా 90 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి కఠిన శిక్ష పడేలా చేస్తామని బంగ్లాదేశ్ లా అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ప్రకటించారు.
ఉస్మాన్ హదీ హత్య తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. నిందితులు భారతదేశానికి పారిపోయారనే వార్తల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయాల వద్ద కూడా ఆందోళనలు జరిగాయి. 'ఇంక్విలాబ్ మంచా' సంస్థ 24 గంటల అల్టిమేటం జారీ చేస్తూ, 13వ జాతీయ ఎన్నికల లోపు హంతకులను పట్టుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో రాబోయే ఎన్నికల నిర్వహణపై , యూనస్ ప్రభుత్వ విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నచిహ్నాన్ని మిగిల్చింది.