Mexico Violence: మెక్సికోలో డ్రగ్ మాఫియా డాన్ హతం.. పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
El Mencho Death Mexico Violence: మెక్సికో ఆర్మీ ఆదివారం జరిపిన ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో’ చనిపోవడంతో అల్లర్లు జరుగుతున్నాయి.

మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతితో మెక్సికోలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెక్సికోలో నివసిస్తున్న తన పౌరుల కోసం భారత్ అడ్వైజరీ జారీ చేసింది. మెక్సికో సిటీలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో సూచించింది.
జాలిస్కో రాష్ట్రం (పుఎర్తో వల్లార్టా, చాపాలా, గ్వాడలజారా), తౌమాలిపాస్ రాష్ట్రం (రెనోసా, ఇతర మున్సిపాలిటీలు), మిచోవాకన్, గెర్రెరో, నువో లియోన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో భద్రతా దళాల ఆపరేషన్లు, రోడ్డు దిగ్బంధం చేయడం, ఇతర నేరపూరిత కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉన్న భారత పౌరులు తదుపరి సమాచారం ఇచ్చే వరకు ఉంటున్న చోటే ఉండాలని సలహా ఇచ్చింది.
భారత పౌరులకు ఎంబసీ జాగ్రత్తలు
భారత రాయబార కార్యాలయం పౌరుల కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పింది. వీటిలో చట్టపరమైన సంస్థల (పోలీస్/సైన్యం) కార్యకలాపాలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండటం, పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ప్రయాణాలు నివారించడంతో పాటు స్థానిక మీడియా ద్వారా అప్‌డేట్లు తెలుసుకోవాలి. అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలో 911కు కాల్ చేయాలని అధికారులు భారత పౌరులకు సూచించారు. గుంపులు గుంపులుగా ఉండే జనసమూహాలకు దూరంగా ఉండాలని, తమ క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్, మెసేజ్ లేదా సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని సూచించారు. ఏదైనా సహాయం లేదా సమాచారం కోసం భారత పౌరులు +52 55 4847 7539 నంబర్‌లో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Dear all Indian nationals in Mexico:
— India in México (@IndEmbMexico) February 22, 2026
There are ongoing security operations and related road blockages and criminal activity, Indian nationals in Jalisco State (areas of Puerto Vallarta, Chapala, and Guadalajara), Tamaulipas State (areas of Reynosa and other municipalities),…
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ మృతి
ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో’ను మెక్సికో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. డ్రాగ్ మాఫియా నడుపుతున్న ఎల్ మంచో కోసం ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. అమెరికా నిఘా వర్గాల సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప సిటీలో అతడు తలదాచుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు చేపట్టింది. ఈ క్రమంలోనే మెంచో గ్యాంగ్ కాల్పులు జరపగా, మెక్సికో ఆర్మీ ఎదురుదాడికి దిగింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచోను తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయాడని తెలిపినట్లు మెక్సికో ఆర్మీ వెల్లడించింది.
మెక్సికో ఆర్మీ జరిపిన ఒక ఆపరేషన్‌లో మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగెరా సెర్వాంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' చనిపోవడంతో పలు చోట్ల హింస చెలరేగింది. ఎల్ మెంచో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అధిపతి. మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, జాలిస్కోలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచో మెక్సికో సిటీకి తరలిస్తుండగా చనిపోయాడు.
























