చంద్రుడిపై పరిశోధనల కోసం అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. దశాబ్దాల క్రితమే కొన్ని దేశాలు చంద్రునిపై ఎన్నో ప్రయోగాలు చేపట్టాయి. అందులో అమెరికా, రష్యా, జపాన్ దేశాల దృష్టి మళ్లీ చంద్రుడు పై పడింది. భారత్ ఇప్పటికే చంద్రుడుపై చంద్రాయన్ 3 ప్రయోగాన్ని చేపట్టి ప్రపంచానికి కొన్ని కొత్త విషయాలు వెల్లడించింది. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.


ఇందులో భాగంగా ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడిన గాని... గురువారం ఉదయం ఈ రాకెట్ విజయవంతంగా నిర్దేశించిన కక్షలోకి చేరినట్లు జపాన్ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. జపాన్ లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్రే టెలిస్కోప్, లూనార్ ల్యాండర్ ను తీసుకొని H2A రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని మొత్తం జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ లైవ్ స్ట్రీమింగ్ చేసింది.  ఈ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన 13 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని హెచ్2ఏ రాకెట్ భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ వెల్లడించింది.


జపాన్ ప్రయోగం ఏమిటంటే?... 


అంతరిక్షంలో గెలాక్సీల మధ్య వేగం, ఇతర విషయాలను కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ప్రయోగించారు. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని జపాన్ చెబుతోంది. అయితే జాబిల్లిపై రహస్యాలు తెలుసుకునేందుకు స్లిమ్ పేరుతో ఒక తేలికపాటి లూనార్ ల్యాండర్ ను పంపించారు. ఈ ల్యాండర్ 3 నుంచి 4 నెలల తర్వాత చంద్రుడి కక్షలోకి ప్రవేశించనుంది. జపాన్ జాబిల్లి, ఇతర గ్రహాలపై భవిష్యత్తు ప్రయోగాల కోసం 'పిన్ పాయింట్ లాండింగ్ టెక్నాలజీ' తో స్లిమ్ ను అభివృద్ధి చేసింది. చంద్రుపై ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాలే ( అమెరికా, రష్యా, చైనా, భారత్)అడుగుపెట్టగా... ఇప్పుడు అనేక దేశాలు చందమామ పై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.


సాఫ్ట్ ల్యాండింగ్ ఎప్పుడంటే....
చంద్రునిపై రహస్యాలను వెలికి తీసేందుకు జపాన్ చేపట్టిన స్లిమ్ మిషన్ చంద్రునిపై ఎప్పుడు ల్యాండ్ అవుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రునిపై ల్యాండ్ అయ్యేందుకు ఇంకా నాలుగు నెలల సమయం పడుతుందని జపాన్ వెల్లడించింది.  గతంలో నాసా నాలుగు నెలల్లో చంద్రుడు పై చేరుకుంది. భారత్ చేపట్టిన  చంద్రయాన్ 3 40 రోజుల్లో చేరుకుంది. ఇప్పుడు జపాన్ చేపట్టిన మూన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడు పైకి చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది.


అనేక విషయాలు వెలుగులోకి....


భారత్ ఇప్పటికే చంద్రుపై ప్రయోగాలు చేపట్టి అనేక విషయాలు చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 1 ప్రయోగం తర్వాత చంద్రుడు పై నీటి జాడ ఉన్నట్లు గుర్తించింది. చంద్రయాన్ 2 అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ఆర్బిటర్ పనితీరు ఇప్పటికీ కూడా బాగుంది. ఇక చంద్రయాన్ 3 సక్సెస్ గురించి ప్రపంచ దేశాలు అభినందించాయి. ఆ తర్వాత ఇటీవల రష్యా లూనార్ 25 ప్రయోగం చేపట్టింది. అయితే అది అనుకున్నట్లుగా సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా క్రాష్ ల్యాండింగ్ అయింది. అయితే ప్రస్తుతం జపాన్ స్లిమ్ మిషన్ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ మూన్ మిషన్ దక్షిణ ధ్రువం పై కాకుండా మరో దృవం పై ఈ ప్రయోగం చేస్తోంది. జపాన్ మొదలుపెట్టిన ఈ మిషన్ నెల క్రితమే జరగాల్సి ఉండగా.... సాంకేతిక సమస్యలు, అంతరిక్షంలో ఉండే మార్పుల కారణంగా మూడుసార్లు వాయిదా పడి నాలుగోసారి ఈ ప్రయోగం చేపట్టింది. ఇక జపాన్ ప్రయోగ ఫలితం ఎలా ఉంటుందో నన్న ఆసక్తి ఉండగా... ఖర్చు విషయంలో భారత్ ను జపాన్ ఫాలో అవుతోందన్న చర్చ జరుగుతుంది.


ఇస్రో అభినందనలు....
చంద్రుడిపై స్లిమ్ లాండర్ ను విజయవంతంగా ప్రయోగించిన జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థకు ఇస్రో అభినందనలు తెలిపింది. అనుకున్న విధంగా జపాన్ చంద్రుడు పై కాలు మోపాలని తెలిపింది. ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు, సంబంధిత అధికారులకు శుభాకాంక్షలు తెలిపింది.