Iran struck Saudi Aramco refinery: సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకటైన రాస్ తనూరా పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం అరామ్కో (Aramco) తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
చమురు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్న రాస్ తనూరా కాంప్లెక్స్ మధ్యప్రాచ్యంలోనే అత్యంత కీలకమైనది. ఇది రోజుకు సుమారు 5,50,000 బారెల్స్ చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, సౌదీ అరేబియాకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా కూడా ఉంది. డ్రోన్ దాడి వల్ల అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అరామ్కో తన ప్లాంట్‌ను మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫ పై ఇది భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం , అరామ్కో ప్లాంట్‌పై దాడి ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై తక్షణమే కనిపించింది. సోమవారం ఈ ఘటన జరిగిన వెంటనే బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 10 శాతం మేర పెరిగాయి. చమురు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో గ్లోబల్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి.
గల్ఫ్ రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం
ఇరాన్ కేవలం సౌదీ అరేబియానే కాకుండా అబుదాబి, దుబాయ్, దోహా, ఒమన్‌లోని వాణిజ్య నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన షిప్పింగ్ హబ్‌లు స్తంభించిపోయాయి. అమెరికా స్థావరాలు ఉన్న కతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలపై కూడా ఇరాన్ క్షిపణులు , డ్రోన్లతో దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది.
చమురు ఉత్పత్తి దారుణంగా పడిపోయే ప్రమాదం
2019లో అబ్కైక్ , ఖురైస్ ప్లాంట్లపై జరిగిన దాడుల సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది. తాజా పరిణామాలు అంతకంటే తీవ్రంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులకు దిగిందని, ఈ పోరు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలనే కాకుండా ప్రపంచ ఆర్థిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
