Iran reverse attack begins : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా మారాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేపట్టిన ముందస్తు దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణులను ప్రయోగిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించడంతో టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలందరూ తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి వెళ్లాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆదేశించాయి.
ఈ దాడుల పరంపర కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాలకు కూడా పాకింది. ఇరాన్ మొత్తం ఎనిమిది దేశాలపైకి మిస్సైళ్లు సంధించించింది. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను ఖతార్ తన క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా అడ్డుకుంది. అబుదాబి, బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ స్థావరాల సమీపంలో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు అందుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆక్రమిత భూభాగాలపై తొలి విడత డ్రోన్, క్షిపణి దాడులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి అని ప్రకటించింది.
అంతర్జాతీయంగా ఈ పరిణామం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్, ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేయగా, లుఫ్తాన్సా వంటి ప్రధాన విమానయాన సంస్థలు దుబాయ్, బీరూట్, మస్కట్ వంటి నగరాలకు సర్వీసులను రద్దు చేశాయి. రష్యా వంటి దేశాలు ఇరాన్‌లో ఉన్న తమ పౌరులను తక్షణమే ఆ దేశం విడిచి రావాలని హెచ్చరించాయి. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని ఉదాత్తమైన మిషన్ అని అభివర్ణిస్తూ ఇరాన్ ప్రజలను ప్రభుత్వంపై తిరగబడాలని కోరడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఒకవేళ ఇరాన్ తన మిత్రదేశాల మద్దతుతో దాడులను ఉధృతం చేస్తే, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ తనపై జరుగుతున్న దాడులకు ప్రతిస్పందనగా కేవలం ఇజ్రాయెల్, అమెరికాలను మాత్రమే కాకుండా, వారి మిత్రదేశాలను, ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఇరాన్ తన క్షిపణులను ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలతో పాటు, జోర్డాన్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో ఉన్న అమెరికా వ్యూహాత్మక స్థావరాల వైపు మళ్ళించింది. అమెరికా దళాలకు సహకరిస్తున్న ఏ దేశమైనా తమకు శత్రువేనని, వారి భూభాగాలను అమెరికా దాడులకు వేదికగా ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
ఇజ్రాయెల్, అమెరికాపై నేరుగా దాడి చేయడమే కాకుండా ఇతర దేశాలపై మిస్సైల్స్ పంపడానికి ప్రధాన కారణం ప్రాంతీయ హెచ్చరిక. అమెరికాకు మధ్యప్రాచ్యంలో ఉన్న సైనిక పట్టును బలహీనపరచడం ద్వారా ఆ దేశాన్ని ఒత్తిడిలోకి నెట్టాలని ఇరాన్ భావిస్తోంది. అలాగే, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు అమెరికాకు సహకరించకుండా భయపెట్టడం ద్వారా యుద్ధాన్ని విస్తరించడం ఇరాన్ వ్యూహం. ఇలా చేయడం ద్వారా ఇజ్రాయెల్ రక్షణ కవచం పై ఒత్తిడి పెంచి, వారిని అన్ని వైపుల నుండి ముట్టడించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఇరాన్ మిత్రపక్షాలైన హిజ్బుల్లా, హౌతీ రెబల్స్ కూడా ఈ యుద్ధంలోకి ప్రవేశించి వివిధ దిశల నుండి దాడులు ప్రారంభించాయి. ఇది పశ్చిమ ఆసియా మొత్తాన్ని ఒక మహా యుద్ధ భూమిగా మారుస్తోంది.
