Attack on Iran nuclear facility: ఇరాన్‌లోని అత్యంత కీలకమైన నతాంజ్ (Natanz) అణు కేంద్రంపై అమెరికా , ఇజ్రాయెల్ దళాలు మెరుపు దాడులు నిర్వహించాయి. కొన్నాళ్లుగా అంతర్జాతీయ ఒప్పందాలను పక్కనపెట్టి ఇరాన్ వేగంగా న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేస్తోందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో జరిగిన ఈ దాడుల్లో నతాంజ్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడి వల్ల అణు కేంద్రంలోని రియాక్టర్లలో సాంకేతిక లోపాలు తలెత్తి, భారీ స్థాయిలో రేడియేషన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక నివేదికలు అందుతున్నాయి.
ఇరాన్ లో ప్రధాన నగరాలకు పొంచి ఉన్న రేడియేషన్ ముప్పు
అణు కేంద్రం నుండి వెలువడుతున్న రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇదే పరిస్థితి మరికొన్ని గంటల పాటు కొనసాగితే ఇరాన్‌లోని పలు ప్రధాన నగరాలను ఖాళీ చేయించక తప్పదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది. అణు ధూళి గాలిలో కలిసి పౌరుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అవకాశం ఉందని, గాలి దిశను బట్టి రేడియేషన్ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నతాంజ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
పెద్ద ఎత్తున అణు ప్రయోగాలు చేస్తున్న ఇరాన్ -అమెరికా కోపం అందుకే !
గత కొంతకాలంగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను రహస్యంగా ముమ్మరం చేసింది. ముఖ్యంగా 60 శాతం పైగా స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేస్తూ అణుబాంబు తయారీకి సిద్ధమవుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఐఏఈఏ నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ సొరంగాల్లో సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసి ఆయుధ తయారీలో బిజీగా ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఇజ్రాయెల్ ఈ దాడుల్లో క్రియాశీలకంగా పాల్గొంది.
IAEA దృష్టికి తీసుకెళ్లిన ఇరాన్
ఈ పరిణామాలతో పశ్చిమ ఆసియాలో బాంబుల మోతలు మోగిపోతున్నాయి. తమ అణు కేంద్రంపై జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం తమ దేశంపైనే కాకుండా మానవాళిపై జరిగిన దాడి అని, దీనికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ, రేడియేషన్ లీకేజీ సమస్య ప్రపంచవ్యాప్తంగా పెను ఆందోళనకు దారితీస్తోంది.
