Israeli Iran War: శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ పై జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ కు చెందిన రెండు అధునాతన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లను, మరికొన్ని డ్రోన్‌లను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు, మహిళలు, పిల్లలతో సహా పౌరులపై దాడి చేసిన తర్వాత తాము ప్రతీకార దాడి చేసినట్టు వెల్లడించింది.  మొదట దాడి ఇజ్రాయెల్ చేసినట్లు ఇరాన్ పేర్కొంది.

సైన్యం అధికారిక ప్రకటనఇరాన్ సైన్యం పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో తమ దేశం వైమానిక రక్షణ దళాలు శత్రు దేశానికి చెందిన రెండు F-35 ఫైటర్ జెట్‌లను, మరికొన్ని డ్రోన్‌లను విజయవంతంగా కూల్చివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం విమాన పైలట్‌లకు ఏమైంది అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఫైటర్ జెట్‌గా F-35 గుర్తింపుF-35 ఫైటర్ జెట్ ఐదవ తరం అత్యంత అధునాతనమైనదిగా, స్టెల్త్ టెక్నాలజీతో కూడుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. దీనిని కూల్చివేయడం ఏ దేశానికైనా గొప్ప సైనిక శక్తి ప్రదర్శనగా చెప్పుకుంటారు. ఈ రకమైన విమానాన్ని కూల్చివేసిన మొదటి దేశంగా ఇరాన్ నిలిచింది.

ఇజ్రాయెల్ ఖండనఈ ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అరబిక్ ప్రతినిధి అవిచై అడ్రై ఒక ప్రకటనలో మాట్లాడుతూ, "ఇరాన్ మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఈ వార్త పూర్తిగా నిరాధారమైనది" అని అన్నారు.

ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం, శుక్రవారం నాడు ఇజ్రాయెల్ కు చెందిన రెండు F-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లను కూల్చివేసినట్లు టెహ్రాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఒక మహిళా పైలట్‌ను కూడా పట్టుకున్నట్లు తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తస్నీమ్ ప్రకారం, ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ చర్యను చేపట్టింది.

భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా తమ అధికారిక X హ్యాండిల్‌లో ఈ విషయాన్ని పంచుకుంది. పోస్ట్‌లో, "ఇరాన్ వైమానిక రక్షణ దళాలు ఇజ్రాయెల్ కు చెందిన రెండు F-35 ఫైటర్ జెట్‌లను కూల్చివేశాయి. అనేక శత్రు డ్రోన్‌లను అడ్డుకున్నాయి" అని పేర్కొంది.

ఇప్పటివరకు ఏం జరిగిందంటే:

ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన: ఇజ్రాయెల్ వైపు ఇరాన్  క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) తెలిపింది. పౌరులందరూ వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించినట్టు పేర్కొంది. 

ఇస్ఫహాన్‌పై భారీ దాడి: ఇస్ఫహాన్‌లోని ఇరాన్ అణు కేంద్రంపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని, "లోహ యురేనియం తయారు చేసే ఫెసిలిటీ, యురేనియంను తిరిగి ఉపయోగించుకునే వ్యవస్థ, ప్రయోగశాలలు, ఇతర నిర్మాణాలు" వంటి కీలక స్థావరాలను నాశనం చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇరాన్ ప్రతిస్పందన: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెషేకియన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సంభాషణలో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయదని, ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలకు హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

భారత్‌ ఆందోళన: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇజ్రాయెల్, ఇరాన్ విదేశాంగ మంత్రులతో వేర్వేరు ఫోన్లలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని చర్చించినట్లు ఆయన Xలో తెలియజేశారు.

ఖమేనీ హెచ్చరిక: ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ టీవీలో ఒక ప్రకటన ఇస్తూ, ఇరాన్ సైన్యం మరింత శక్తిమంతంగా రియాక్ట్ అవుతుందని ఇజ్రాయెల్‌ను మోకాళ్లపై నిలబెడుతుందని హెచ్చరించారు. ఈ దాడిని సహించబోమని అన్నారు.

రష్యా ఖండన: రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడులను ఖండించారు. అణు స్థావరాలపై గతంలో జరిగిన దాడులపై తన విమర్శను పునరుద్ఘాటించారు.

ఇస్ఫహాన్‌లో పేలుళ్లు: ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు సంభవించిందని ఇరాన్ వార్తా సంస్థ మెహర్ నివేదించింది,  

ఫోర్డోలో కూడా పేలుళ్లు: ఇరాన్ ఫోర్డో అణు కేంద్రం సమీపంలో రెండు పెద్ద పేలుళ్లు వినిపించాయి. ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చినట్టు అసోసియేటెడ్ ప్రెస్ ప్రచురించింది. 

టెహ్రాన్‌లో వైమానిక రక్షణ చర్య: టెహ్రాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ అయ్యాయి. అనేక దాడులను అడ్డుకున్నాయి. పాస్టర్ స్క్వేర్ వంటి సురక్షిత ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు చేపట్టారు. 

ఐడిఎఫ్ చీఫ్ హెచ్చరిక: ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ మాట్లాడుతూ సైన్యం పూర్తి శక్తిమంతంగా,  వేగంతో పనిచేస్తోందని అన్నారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని కోరారు.

జెరూసలేంలో ప్రమాదం: ఈ దాడులు జరుగుతుండగా, జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లు మోగడం ప్రారంభించాయి. యెమెన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.