Hong Kong skyscrapers Fire: అపార్టుమెంట్లు అంటే అగ్నిప్రమాదాలు ఉండవని అనుకుంటారు. కానీ హాంకాంగ్‌లో జరిగిన ప్రమాదాన్ని చూస్తే ఇక ఎత్తైన అపార్టుమెంట్లు కూడా సేఫ్ కాదని అర్థం అయిపోతుంది.
హాంకాంగ్‌లోని వాంగ్ కోర్ట్ అనే పాత గృహ సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది టవర్లు ఉన్న ఈ భవనాల చుట్టూ మరమ్మతుల కోసం వెదురు కడ్డీలతో కంచె ఏర్పాటు చేసి పని చేస్తున్నారు. ఆ కడ్డీల చుట్టూ ప్లాస్టిక్ నెట్ కూడా కప్పి ఉంది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒక టవర్‌లో చిన్న మంట మొదలైంది. వెదురు కడ్డీలు, ప్లాస్టిక్ నెట్ కారణంగా ఆ మంట క్షణాల్లో ఎనిమిది టవర్లలో ఆరింటికి వ్యాపించింది. దట్టమైన పొగ, భయంకరమైన వేడి వల్ల అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లడం కష్టమైంది.
300 మంది అగ్నిమాపక సిబ్బంది, 60 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. డ్రోన్‌లు, రోబోట్ కెమెరాలు వాడారు. ఎనిమిది గంటల పోరాటం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. హాంగ్‌కాంగ్‌లో భవనాల మరమ్మతులకు వెదురు కడ్డీలు చాలా సాధారణం. ధర తక్కువ కాబట్టి అందరూ వాడతారు. కానీ ఈ వెదురు చాలా త్వరగా మండుతుంది. దాని చుట్టూ కప్పిన ప్లాస్టిక్ నెట్ కూడా మంటలు ఇం పెరగడానికి కారణం అయ్యాయి. ఈ రెండూ కలిసి “ఫైర్ ట్రాప్” లాగా మారి, లోపలున్నవాళ్లు బయటపడలేకపోయారు.
ఈ వీడియోలు అందర్నీ భయపెడుతున్నాయి. పెద్ద ఎత్తున కుటుంబసభ్యులు ఇళ్లల్లో ఇరుక్కుపోవడంతో బయటకు రాలేక చనిపోయారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. యాభై మందికిపైగా చనిపోయినట్లు తేల్చారు.
ఇటీవల హైదరాబాద్‌లోనూ విపరీతంగా స్కై స్క్రాపర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదం మన వద్ద అలాంటి అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగా మారుతోంది.