Former Nickelodeon child star Tylor Chase: గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే చీకటి కోణానికి నిలువుటద్దంగా నిలిచిన బాలనటుడు టైలర్ చేజ్ గాథ ఇది. 'నికెలోడియన్' ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, గత వారం రోజులుగా కాలిఫోర్నియా వీధుల్లో అనాథలా బతుకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెలుగుల ప్రపంచంలో వెలిగిపోయిన ఒక స్టార్ ఇలా దిక్కులేని స్థితిలో ఉండటం చూసి నెటిజన్లు కంటతడి పెట్టారు.
మానవత్వం ఇంకా మరణించలేదని నిరూపిస్తూ జాకబ్ హారిస్ అనే వ్యక్తి అతడిని గుర్తించి, మళ్ళీ తన కుటుంబంతో కలిపే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా జాకబ్ హారిస్ అనే వ్యక్తి టైలర్ చేజ్ కోసం గాలించి, చివరికి అతడు ఎక్కడున్నాడో కనిపెట్టాడు. అతనికి ధైర్యం చెప్పి.. తీసుకెళ్లి ఒక హోటల్ గదిలో ఉంచారు. అతడు తన జీవితంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి, వ్యసనాల నుండి బయటపడటానికి మానసిక ప్రశాంతత అవసరమని భావించి ఈ ఏర్పాటు చేశారు. తన తండ్రితో మాట్లాడిన తర్వాత చేజ్ కూడా చికిత్స తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
టేలర్ చేజ్ చాలా కాలంగా బైపోలార్ డిజార్డర్ అనే మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీని గురించి గతంలో ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో కవితల రూపంలో కూడా వ్యక్తం చేశారు. మానసిక అనారోగ్యంతో పాటు డ్రగ్స్ కు బానిసయ్యారు. ఈ రెండు సమస్యలు తోడవడంతో ఆయన తన జీవితంపై నియంత్రణ కోల్పోయి, గత ఐదు నెలలుగా కుటుంబానికి దూరమై వీధుల పాలయ్యారు. టేలర్ చేజ్ పరిస్థితి చూసి కొందరు అభిమానులు 'GoFundMe' ద్వారా విరాళాలు సేకరించారు. అయితే, అతని తల్లి ఆ అకౌంట్‌ను క్లోజ్ చేయాలని కోరారు. టేలర్ ప్రస్తుతం ఉన్న స్థితిలో తన దగ్గర ఉన్న డబ్బును లేదా మందులను సరిగ్గా నిర్వహించుకోలేడని.. చేతిలో డబ్బు ఉంటే ఆయన మళ్ళీ డ్రగ్స్ కొనడానికి ఉపయోగించే అవకాశం ఉందని, అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. టేలర్‌కు కావాల్సింది డబ్బు కాదు, వైద్య సహాయం అని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఆయనకు ఎన్ని ఫోన్లు కొనిచ్చినా రెండు రోజుల్లోనే పోగొట్టుకునేవాడని, అందుకే ఆయనకు దీర్ఘకాలిక వైద్య చికిత్స అవసరమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం జాకబ్ హారిస్ మరియు తోటి నటుల సాయంతో టేలర్ తన తండ్రితో మాట్లాడారు. డెటాక్స్, పునరావాస కేంద్రంలో చేరడానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయనకు సరైన చికిత్స అందించి, మళ్ళీ సాధారణ జీవితం గడిపేలా చేయడానికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. బాల్యంలోనే కీర్తిని సంపాదించిన ఎందరో నటులు ఆ తర్వాత కాలంలో డ్రగ్స్ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి దుస్థితికి చేరుకుంటున్నారు. టైలర్ చేజ్ విషయంలో కూడా అదే జరిగింది.