Epstein Files: బ్రిటిష్ రాజకీయాల్లో ఎప్‌స్టీన్ మంటలు -ప్రధాని స్టార్మర్ పదవికి ముప్పు- రేసులో షబానా మహమూద్!
Epstein UK: బ్రిటన్ రాజకీయల్లో ఎప్‌స్టీన్ ఫైల్స్ మంట పెట్టాయి. ప్రధాని స్టార్మర్ పదవికి గండం ఏర్పడింది. పాకిస్తాన్ సంతతికి చెందిన మహిళానేత ప్రధాని అయ్యే అవకాశం ఉంది.

UK first Muslim prime minister: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికా ఆర్థిక, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్‌ను స్టార్మర్ తొలగించినప్పటికీ, ఆ సెగ ఇప్పుడు నేరుగా ప్రధాని పదవికే తాకుతోంది. మాండెల్సన్ గత చరిత్ర తెలిసినప్పటికీ, ఆయనను కీలక పదవిలో నియమించడం స్టార్మర్ రాజకీయ నిర్ణయాధికార లోపమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో , ఒకవేళ స్టార్మర్ రాజీనామా చేయాల్సి వస్తే, ఆయన స్థానంలో మొట్టమొదటి ముస్లిం ప్రధానిగా షబానా మహమూద్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం బ్రిటన్ హోం సెక్రటరీగా ఉన్న 45 ఏళ్ల షబానా మహమూద్, లేబర్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా ఎదిగారు. పాకిస్థాన్ మూలాలున్న ఈమె, వలసల నియంత్రణ , అంతర్గత భద్రత విషయంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను తిరిగి పంపే విషయంలో ఆమె అనుసరిస్తున్న కఠిన వైఖరి, పార్టీలోని రైట్ వింగ్ నాయకులను , సాధారణ ఓటర్లను ఆకట్టుకుంటోంది. స్టార్మర్ నాయకత్వంపై నమ్మకం సడలుతున్న తరుణంలో, పార్టీని గాడిలో పెట్టగల సమర్థురాలిగా ఆమె పేరును పలువురు లేబర్ ఎంపీలు ప్రతిపాదిస్తున్నారు.
ఎప్ స్టీన్ ఫైల్స్ బయటకు రావడం వల్ల కేవలం పీటర్ మాండెల్సన్ మాత్రమే కాకుండా, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, కీలక సలహాదారుల పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టార్మర్ ప్రధాన సలహాదారు మోర్గాన్ మెక్‌స్వీనీ రాజీనామా చేయడం ఈ సంక్షోభ తీవ్రతను సూచిస్తోంది. ఈ పరిస్థితుల్లో లేబర్ పార్టీ తన ప్రతిష్టను కాపాడుకోవడానికి నాయకత్వ మార్పు కోరుకుంటే, షబానా మహమూద్ ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. న్యాయవాద వృత్తిలో ఆమెకు ఉన్న ఇమేజ్, పార్లమెంటరీ కమిటీలలో ఆమె ప్రదర్శించిన వాక్చాతుర్యం ఆమెను రేసులో ముందుంచుతున్నాయి.
Shabana Mahmood is set to become the next and first Muslim prime minister of the UK if Keir Starmer resigns over the Epstein fallout.
— Alex Jones (@RealAlexJones) February 8, 2026
The UK has been concord and a shot didn’t even have to be fired.
NOW 2 Islamic nations have nuclear weapons that can strike anywhere on earth.… pic.twitter.com/8bE26qdJNW
ఒకవేళ షబానా మహమూద్ ప్రధాని అయితే, అది బ్రిటన్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. అయితే, ఆమె ముందు సవాళ్లు కూడా తక్కువేమీ లేవు. పార్టీలోని ఇతర సీనియర్ నేతలు ఏంజెలా రైనర్, వెస్ స్ట్రీటింగ్ వంటి వారు కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతానికి స్టార్మర్ తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎప్ స్టీన్ ఉదంతంలో మరిన్ని కొత్త విషయాలు బయటకు వస్తే బ్రిటన్ రాజకీయ ముఖచిత్రం మారడం ఖాయంగా కనిపిస్తోంది. షబానా మహమూద్ ప్రధాని పీఠం అధిరోహిస్తే, అది కేవలం ఒక మతపరమైన గుర్తింపుగానే కాకుండా, లేబర్ పార్టీ సిద్ధాంతాల్లో వస్తున్న మార్పుకు సంకేతంగా నిలుస్తుంది.























