Elon Musk: అమెరికా వ్యాపార దిగ్గజం, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేసిన సంచలనమే. నిత్యం వార్తల్లోనే ఉంటారు. శనివారం ఓ వీడియో విడుదల చేశాడు ఎలన్. కేజీఎఫ్ సినిమాలో యష్ స్టైల్లో అసాల్ట్ రైఫిల్ చేతపట్టుకుని బుల్లెట్లు పేల్చాడు. దీనిని సంబంధించిన వీడియోను ఎలన్ విడుదల చేశాడు. తన సొంత సోషల్ మీడియా వెబ్ సైట్ Xలో 26 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు. తాను కాల్పులు జరుపుతున్నట్లు చూపిస్తూ, "హిప్-ఫైరింగ్ మై బారెట్ 50 కాల్" అంటూ పోస్ట్ చేశాడు. 






ఇలాంటి వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం మస్క్‌కు కొత్త కాదు. అంతకుముందు నవంబర్ 2022లో మస్క్ రెండు తుపాకులు (పిస్టల్స్)తో పాటు కూల్ డ్రింక్స్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ‘మై బెడ్‌సైడ్ టేబుల్’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. అమెరికాలో తుపాకుల వినియోగంపై మే 2022లో మరో పోస్ట్ చేశాడు. USలో తుపాకుల నియంత్రణ అవసరం అన్నారు. అసాల్ట్ రైఫిల్స్‌కు ప్రత్యేక అనుమతి అవసరమని అభిప్రాయపడ్డారు. టెక్సాస్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన తుపాకీ హింసలో 19 మంది చిన్నారులు సహా 21 మంది చనిపోయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు . ఈ సంఘటన తర్వాత, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా తుపాకీ చట్టాలను మార్చాలని పిలుపునిచ్చారు. బైడెన్ "కామన్సెన్స్" తుపాకీ చట్టాల కోసం పిలుపునిచ్చారు.


ట్విటర్‌లో మార్పులకు శ్రీకారం
ఎక్స్ (ట్విటర్)లో ఎలన్ మస్క్ మరోసారి మార్పులు చేపట్టారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం ఎలన్ మస్క్ పలు మార్పులు తీసుకొచ్చారు. ట్విటర్ పేరును X గా మార్చారు. ఆపై బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్రవేశ పెట్టారు. అంతకు ముందు వెరిఫైడ్ అకౌంట్లు పొందే బ్లూ టిక్‌ను పెయిడ్ సర్వీసుగా మార్చారు.  ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెరిఫైడ్ అకౌంట్లకు జమ చేస్తున్నారు. తాజాగా ఆయన మరో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో Xని ఉపయోగించే ప్రతి ఒక్కరూ నెలవారీ రుసుము చెల్లించాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. 


బాట్స్ (Bots), నకిలీ ఖాతాల సమస్యను ఎదుర్కోవడానికి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ రుసుము ఎంత ఉంటుందో? రుసుము చెల్లించిన వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఆయన మస్క్ వివరించలేదు. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ X ప్లాట్‌ఫాంలో గణనీయమైన మార్పులు చేశారు. గతంలో నిషేధించిన ఖాతాలను తిరిగి రావడానికి అతను అనుమతించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి అకౌంట్ల పునరుద్ధరించారు. ప్రముఖ వ్యక్తుల ఖాతాలను గుర్తించే బ్లూ టిక్‌ను తొలగించారు. 


ప్రస్తుతం ఎవరైనా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వారి పేరు పక్కన బ్లూ బ్యాడ్జ్‌ని పొందుతారు. వారి పోస్టులు ఎక్కువ మందికి కనిపిస్తాయి. సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారి పోస్టుల రీచ్ తక్కువగా ఉంటుంది. ఈ మార్పులతో X ప్లాట్‌ఫాంలో బాట్‌ల వినియోగాన్ని తగ్గిస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే X యునైటెడ్ స్టేట్స్‌లో మనీ ట్రాన్స్‌మిటర్‌గా మారడానికి లైసెన్స్‌లను పొందేందుకు దరఖాస్తు చేసుకుంది.  పబ్లిక్ రికార్డుల ప్రకారం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అనుమతులు వచ్చాయి.