America Elections 2024: అమెరికాకు మళ్లీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మహిళల శరీరాలపై హక్కలను శాసించేలా ప్రభుత్వాలు తయారవుతాయని వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో పోటీలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా నేషనల్ అబార్షన్ చట్టంపై ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. ఈ అంశపై స్పందించిన ట్రంప్.. డెమోక్రాట్ల మనస్సులు రాడికల్ మయం అయ్యాయంటూ వ్యాఖ్యానించారు.
అబార్షన్ రైట్స్‌కు సంబంధించి సుప్రీం తీర్పుపై మండిపడ్డ కమలా.. ట్రంప్ అనుకూల జస్టిస్ వచ్చేలా చక్రం తిప్పారని అన్నారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే నేషనల్ అబార్షన్ హక్కులపై బ్యాన్ పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికన్లు తమ శరీరం సహా తమ రీప్రొడక్టివ్ సిస్టమ్స్‌కు సంబంధించి నిర్ణయాలు తమవై ఉంటాయని భావిస్తారని.. ట్రంప్ మాత్రం ఆ పరిస్థితి లేకుండా చేస్తారని హెచ్చరించారు. అమెరికన్ల శరీరాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు ఉండకూడదన్నారు. అబార్షన్ బిల్లు విషయంలో ట్రంప్ అన్నీ అసత్యాలే చెబుతున్నారని అన్నారు.
హారిస్ వస్తే ఇజ్రాయెల్ ఉండదు.. ట్రంప్ వస్తే అమెరికన్లను చైనాకు అమ్మేస్తారు
ఇజ్రాయెల్ విషయంలో కమలాహారిస్ మొదటి నుంచి వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నారని ట్రంప్ దుయ్యబట్టారు. ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికైతే రెండేళ్లలోనే తన విధానాలతో ఇజ్రాయెల్ లేకుండా చేస్తారని మాజీ ప్రెసిడెంట్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చిన హారిస్.. మళ్లీ ట్రంప్ వస్తే అమెరికన్లను చైనాకు అమ్మేస్తారని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తన లంచ్‌లోకి ట్రంప్‌ను ఆరగించేస్తారంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
Also Read: అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడికి 23 ఏళ్లు- అయినా మానని గాయాలు
చైనా విషయంలో నాడు ట్రంప్ మెతక వైఖరి అవలింబించడం వల్లే నేడు డ్రాగన్ కోరలు చాస్తోందని కమల విమర్శించారు. ఎకనమిక్ పాలసీలపై మాట్లాడిన హారిస్.. దేశంలోని ఎకనమిస్టులు అందరూ తనకే మద్దతుగా ఉన్నారని చెప్పారు. ట్రంప్‌కి మాత్రం దేశంలోని బిలయనీర్లు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. తన విధానాలతోనే అమెరికా తిరిగి ఆర్థికంగా పుంజుకుంటుందని ట్రంప్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఇన్‌ఫ్లేషన్‌ను కంట్రోల్ చేస్తామని.. అందరికీ ఉద్యోగ అవకాశాలు సహా అమెరికన్ల ఆర్థిక పురోగతికి కృషి చేస్తామని చెప్పారు.
తనపై జరిగిన హత్యాయత్నం పూర్తిగా డెమోక్రాట్ల కుట్రేనని ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. డెమోక్రాట్లు తనను రాజ్యాంగ వ్యతిరేకిగా చెబుతారన్న ఆయన.. వాస్తవానికి తనను అంతమొందించి రాజ్యాంగాన్ని మట్టుపెట్టాలని చూసింది వారేనని పేర్కొన్నారు. 2021 జనవరి 6 ఘటన అమెరికన్లు ఎప్పటికీ మరిచిపోరని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారని కమలా హారిస్ అన్నారు. ఆ ఘటన సమయంలో ట్రంప్ తన వైఖరి సరైనదేనని పునరుద్ఘాటించారు. ఆ దాడిలో పాల్గొన్న వారి పట్ల ప్రభుత్వం న్యాయవ్యవస్థ అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు. హైతీ నుంచి వచ్చిన వలసదారుల పట్ల డిబేట్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాళ్లు తమ పెంపుడు జంతువులను కూడా వదలకుండా తింటున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.