Donald Trump wishes PM Modi: బెంగాల్‌లో తొలిసారి బీజేపీ విజయం.. ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ అభినందనలు
Donald Trump on West Bengal Election Results | పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తొలిసారి విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు.

వాషింగ్టన్: దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం, వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ మాట్లాడుతూ 'గత నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీని ప్రశంసించారు. భారత్ చాలా లక్కీ. మోదీ లాంటి నేత నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయం సాధించిన నరేంద్ర మోదీకి అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు తెలిపారని' పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, తమిళనాడు టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించడం తెలిసిందే.
బెంగాల్ విజయంపై ప్రధాని మోదీ స్పందన
తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎట్టకేలకు పాగా వేసింది. గత ఎన్నికల్లో తమ విజయానికి బాటలు వేసుకున్న బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో విజయకేతనం ఎగురవేసింది. సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో తన మద్దతును పెంచుకుంది. ఈ విజయంతో బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగాల్‌లో విజయం తరువాత, న్యూఢిల్లీలో తమ మద్దతుదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ విజయం రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి నాంది అని అన్నారు.
ఇది భయం లేని, అభివృద్ధి, నమ్మకంతో నిండిన బెంగాల్ వైపు ఒక నిర్ణయాత్మక అడుగు అని ప్రధాని మోదీ అన్నారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలను ప్రస్తావించారు. 'దశాబ్దాల నిరీక్షణ ఇప్పుడు ముగిసింది. ప్రజలు ఆ దిశగా అడుగులు వేసేందుకు బీజేపీకి అవకాశాన్ని ఇచ్చారని' ప్రధాని మోదీ అన్నారు.
బెంగాల్ ఫలితంపై ప్రపంచవ్యాప్తంగా స్పందన
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) చారిత్రాత్మక విజయంపై టర్కీ, బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు స్పందించాయి. ప్రపంచ మీడియా ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ చతురత టీఎంసీకి పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది అధికార వ్యతిరేకత, బీజేపీ మరింత ప్రభావవంతమైన ప్రచారం రెండింటి మధ్య వచ్చిన ఫలితం అన్నారు. ది గార్డియన్ ప్రకారం, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన రాహుల్ వర్మ బెంగాల్ బీజేపీ విజయాన్ని ఏడు సంవత్సరాల ప్రాజెక్ట్ ఫలితంగా అభివర్ణించారు.
లండన్‌కు చెందిన రాయిటర్స్ దీనిని పలు విధాలుగా బీజేపీకి ఇది గొప్ప విజయంగా అభివర్ణించింది. 'భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ గొప్ప విజయం సాధించింది. ఇది సీఏఏతో పాటు మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి ప్రధాన విధానాలను మరింత ఊతమిస్తుంది. ఇది 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ శుభవార్త' అని రాసుకొచ్చింది. జర్మన్ బ్రాడ్‌కాస్టర్ డీడబ్ల్యూ 'ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద బీజేపీ పార్టీ మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విజయం సాధించింది. తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది' అని రిపోర్ట్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు






















