US Golden Dome System: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణకు అత్యంత శక్తివంతమైన క్షిపణి భద్రతా వ్యవస్థ 'గోల్డెన్ డోమ్' (Golden Dome)ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటంటే.. శత్రు క్షిపణులను వెంటనే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని మధ్యలోనే ఆకాశంలోనే నాశనం చేయడం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'గోల్డెన్ డోమ్ ప్రణాళికకు' మొదట్లో 25 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ అనుకున్నారు. అయితే, మొత్తం వ్యవస్థను నిర్మించడానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం. దీని నిర్మాణం అంతా అమెరికాలోనే జరుగుతుంది. 

గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. నా పదవీకాలం ముగిసేలోపు ఇది పూర్తవుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ బాధ్యతను జనరల్ మైఖేల్ గుయెట్‌లీన్‌కు అప్పగించింది. ఇది ఇజ్రాయెల్ కు చెందిన 'ఐరన్ డోమ్' వ్యవస్థ నుంచి స్ఫూర్తి పొందింది. కానీ దీని పరిధి ఎక్కువ.  అంతరిక్షం నుంచి సైతం ఇది పర్యవేక్షణ చేయనుంది. ఇందులో వందల పర్యవేక్షణ ఉపగ్రహాల నెట్‌వర్క్ ఉంటుంది. ఈ ఉపగ్రహాలు క్షిపణులు ప్రయోగించిన వెంటనే వాటిని గుర్తించి, నాశనం చేయడంలో సహాయపడతాయి. ఇవి రియల్ టైమ్ డేటా షేరింగ్, రేడార్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానమై ఉంటాయి.  ఇందులో AI ఆధారిత టెక్నాలజీ వినియోగిస్తారు. ట్రాకింగ్, ఫైర్ కమాండ్ ఏఐ ద్వారా చేయనున్నారు. ఈ వ్యవస్థ అమెరికా రక్షణ వ్యూహంలో అంతరిక్ష ఆధారిత రక్షణ (స్పేస్-బేస్డ్ డిఫెన్స్)ను తొలి స్థానంలో ఉంచుతుందని’ భావిస్తున్నట్లు తెలిపారు.

ఆసక్తి చూపుతున్న కెనడాఅమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై కెనడా ఆసక్తి చూపిందని, అమెరికా తన పొరుగు దేశానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఈ ప్రాజెక్ట్‌ను కేవలం దేశ ప్రజల భద్రతకు మాత్రమే పరిమితం చేయాలని భావించడం లేదు. ఇది నాటో దేశాలతో భాగస్వామ్యం కోసం కొత్త ఆలోచనలు చేస్తుందన్నారు.  చైనా, రష్యా వంటి దేశాలకు గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సంకేతాలు పంపుతున్నాం. జనరల్ మైఖేల్ గుయెట్‌లీన్‌ను ఈ వ్యవస్థ డైరెక్టర్,  పర్యవేక్షణ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

ఇప్పటికే పని ప్రారంభించిన పెంటగన్పెంటగన్ ఇప్పటికే సెన్సార్లు, ఉపగ్రహాలు, క్షిపణి పరీక్షల విధివిధానాలను సైతం రూపొందించింది. అమెరికా ప్రభుత్వ బడ్జెట్ ఆమోదంతో గోల్డెన్ డోమ్ నిర్మాణానికి సిద్ధమవుతాం. ట్రంప్ ఎన్నికల హామీగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టారు. దీని సహాయంతో అమెరికా ICBM, హైపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసి దీటుగా ఎదుర్కోగలదు. అంతరిక్ష ఆధిపత్యంలోనూ అమెరికాకు మెరుగైన స్థానంలో నిలవనుంది. ఇది అత్యంత భద్రత కలిగిన రక్షణ వ్యవస్థగా మారుతుందని ట్రంప్ భావిస్తున్నారు.