Middle East Tensions: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికన్ సంయుక్త సైనిక చర్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది, ఈ ఘర్షణ మరింత తీవ్రమవుతోంది. ఈ సందర్భంగాలో అందర్నీ భయపెడుతున్న అంశం ఏంటంటే? ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయా? లేకపోతే, వాటిని అభివృద్ధి చేయగల సామర్థ్యం దానికి ఉందా? ప్రయోగిస్తే పరిస్థితి ఏంటనే అనుమానం చాల మందిలో ఉంది.
ఇరాన్ అణు కార్యక్రమం:
1980ల నుంచి ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తన అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని టెహ్రాన్ చెబుతూ వస్తోంది. అంటే ఇంధన ఉత్పత్తి, వైద్య వినియోగం కోసమేనని ఎప్పటికప్పుడు వాదిస్తోంది. US సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) మునుపటి నివేదికల ప్రకారం, ఇరాన్ 2003లో తన వ్యవస్థీకృత అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి అధికారికంగా ఆయుధాల అభివృద్ధిని కొనసాగించలేదు.
అదేవిధంగా, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం (ODNI), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) నుంచి వచ్చిన అంచనాల ప్రకారం ఇరాన్ ప్రస్తుతం క్రియాశీల అణ్వాయుధ అభివృద్ధిలో నిమగ్నం కాలేదు. కానీ భవిష్యత్తులో ఆయుధాల అభివృద్ధికి దారితీసే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసిందని పేర్కొన్నాయి.
ఇరాన్‌కు అణ్వాయుధాలు తయారు చేయగల సామర్థ్యం ఉందా?
అణ్వాయుధాన్ని తయారు చేయాలంటే, యురేనియంను దాదాపు 90% వరకు సమకూర్చుకోవాలి. అంతర్జాతీయ అణు నిఘా సంస్థ నివేదికల ప్రకారం, ఇరాన్ 60% వరకు సుసంపన్నమైన యురేనియంను ఉత్పత్తి చేసింది, ఇది ఆయుధ-గ్రేడ్ స్థాయిల కంటే తక్కువ కానీ సాంకేతికంగా సాధ్యమే.
అయితే, ఒక దేశం సుసంపన్నమైన యురేనియం కలిగి ఉండటం , వాస్తవంగా పరీక్షించదగిన అణు పరికరాన్ని అభివృద్ధి చేయడం రెండు వేర్వేరు ప్రక్రియలు.
అందుబాటులో ఉన్న అంతర్జాతీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఇరాన్ వద్ద అణ్వాయుధం లేదు. గతంలో దాని ఆయుధ కార్యక్రమాన్ని నిలిపివేసింది. సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉంది, కానీ క్రియాశీల ఆయుధ అభివృద్ధిని నిర్ధారించలేదు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి అదనపు సంపన్నత, పరీక్షలు అవసరం. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ వద్ద అణు బాంబు ఉందని చెప్పడం వాస్తవంగా సరైనది కాదు.
