Myanmar Earthquake Death Toll: మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 1000 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
Earthquake Death Toll | మయన్మార్, థాయ్‌లాండ్‌లలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపాలలో 1000 మంది మృతిచెందగా, వేల మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Earthquake in Myanmar | నేపిడా: మయన్మార్, థాయ్‌లాండ్‌లలో సంభవించిన భారీ భూకంపంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. ఈ రెండు దేశాలలో భూకంప మృతుల సంఖ్య 1000 దాటింది. శుక్రవారం నాడు మయన్మార్ లో, థాయిలాండ్‌లలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాలతో వేల ఇండ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి . ఇంకా వేలాదిమంది శిబిలాల కింద చిక్కుకున్నారు. మయన్మార్ లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలే దర్శనమిస్తున్నాయి.
మయన్మార్ లో భారీగా ప్రాణ నష్టం
మయన్మార్ లో సంభవించిన భూకంపంలో 900 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో పది మంది వరకు చనిపోయారు అని అధికారులు తెలిపారు. రెండు దేశాలలో 2 వేల మంది వరకు గాయపడగా, ఆస్పత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. అమెరికా సంస్థలు మాత్రం ఈ విపత్తులలో మృతుల సంఖ్య పదివేలు దాటుతుందని అంచనా వేశాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరోసారి భూకంపం సంభవించింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూమి కంపించింది.
ఎటుచూసినా కూలిన భవనాలు, శిథిలాలే..
మయన్మార్ లో ఎటు చూసిన కూలిన భవనాలే కనిపిస్తున్నాయి. వందల మంది చనిపోయినా, ఇంకా శిథిలాల కింద వేల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. కూలిన భవనాల శిథిలాలు తొలగించి, లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను మయన్మార్ ప్రభుత్వం ముమ్మరం చేసింది.
భారత్ భారీ సాయం..
శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మయన్మార్లో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ భారీ భూకంపాలతో ఆ దేశ ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. పలు దేశాలు మయన్మార్, థాయిలాండ్ కు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఆపరేషన్ బ్రహ్మ కింద భారత ప్రభుత్వం మయన్మార్కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. పలు దేశాలు యమన్మార్ కు, థాయ్ లాండ్‌కు సహకారం అందిస్తున్నాయి.
మయన్మార్‌లో అర్ధరాత్రి మరోసారి భూకంపం కలకలం రేపింది. రాత్రి 11.56 గంటలకు, ఆ తరువాత మరోసారి మయన్మార్‌లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.