China HighSpeed Trains: గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తే  చాలా వేగంగా వెళ్లినట్లు. బుల్లెట్ ట్రైన్స్ మూడు వందల కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్తాయి. కానీ చైనా ఏకంగా ఆరు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లను రెడీ చేసింది.  చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్  అభివృద్ధి చేసిన 600 కి.మీ/గం. వేగంతో ప్రయాణించగల మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) ట్రైన్ ప్రోటోటైప్, ఐదేళ్ల పరీక్షల తర్వాత ఇప్పుడు సిద్ధంగా ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ (CCTV) ప్రకటించింది. ఈ అత్యాధునిక రవాణా వ్యవస్థ, ప్రపంచంలోనే అతి వేగవంతమైన  ట్రైన్‌గా నిలుస్తుంది. జపాన్ మాగ్లెవ్ ట్రైన్‌లు ప్రయోగాత్మకంగా 603 కి.మీ/గం. వేగం చేరినప్పటికీ ఇంకా వాణిజ్య వినియోగానికి  సిద్ధం కాలేదు. కానీ ఈ రైలు ఆపరేషన్‌కు రెడీ అయింది. 

Continues below advertisement

ఈ  మాగ్లేవ్ రైలును 2019లో మొదటిసారి ప్రదర్శించారు.  2020లో షాంఘైలోని టాంగ్జీ యూనివర్సిటీలో 1.5 కి.మీ. పరీక్షా ట్రాక్‌పై మొదటి టెస్ట్ రన్ పూర్తి చేసింది. 2021లో క్వింగ్‌డావోలో అసెంబ్లీ లైన్ నుండి బయటకు వచ్చిన ఈ ట్రైన్, ఐదేళ్లకాలం పరీక్షలు, మెరుగుదలలు చేపట్టిన తర్వాత ఇప్పుడు పూర్తిగా సిద్ధం చేశారు.  ఈ ట్రైన్ 0 నుండి 600 కి.మీ/గం. వరకు సుమారు 3.5 నిమిషాల్లో చేరుకోగలదు. మాగ్లెవ్ టెక్నాలజీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్‌లతో ట్రైన్‌ను రైల్ పైకి 1 సెం.మీ. ఎత్తున , ఫ్రిక్షన్ లేకుండా ముందుకు ఆకర్షించే వ్యవస్థ. జర్మన్ ట్రాన్స్‌రాపిడ్ టెక్నాలజీపై ఆధారపడి అభివృద్ధి చేసిన ఈ చైనా మోడల్, ఆధునిక ఏరోడైనమిక్ డిజైన్‌తో, పాయింటెడ్ నోజ్‌తో గాలి డ్రాగ్‌ను తగ్గిస్తుంది. ఇంటీరియర్‌లో పెద్ద వీడియో స్క్రీన్‌లు, ఫ్యూచరిస్టిక్ సీటింగ్‌లు ఉంటాయి.  ఈ ట్రైన్, బీజింగ్-షాంఘై మార్గంలో (1,200 కి.మీ.) ప్రస్తుత 5.5 గంటల హై-స్పీడ్ రైల్ ప్రయాణాన్ని 2.5 గంటలకు తగ్గించగలదు. ఇది విమానాలతో పోల్చితే కూడా ఆకర్షణీయంగా భావిస్తున్నారు. వ  షాంఘై మాగ్లెవ్ ట్రైన్, ప్రపంచంలోనే మొదటి , ఏకైక వాణిజ్య హై-స్పీడ్ మాగ్లెవ్ లైన్‌గా 2004లో ప్రారంభమైంది. పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లాంగ్‌యాంగ్ రోడ్ స్టేషన్ వరకు 30 కి.మీ. మార్గంలో ప్రయాణిస్తూ, గరిష్ఠ వేగం 431 కి.మీ/గం.  తో 8 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ లైన్, ట్రాన్స్‌రాపిడ్ టెక్నాలజీపై ఆధారపడి, రోజుకు 108 ట్రిప్స్ నడుస్తుంది . 574 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది.     

ఈ 600 కి.మీ/గం. మాగ్లెవ్, 17వ మోడరన్ రైల్వేస్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.  దక్షిణ కొరియా, జపాన్‌తో పాటు మాగ్లెవ్ టెక్నాలజీలో పోటీపడుతున్న చైనా, ఇక్కడితో ఆగకుండా 1,000 కి.మీ/గం. 'సూపర్ మాగ్లెవ్' డిజైన్‌ను కూడా పరీక్షిస్తోంది.  చైనా ప్రభుత్వం, ఈ టెక్నాలజీని విస్తరించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమకు బూస్ట్ ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.