Bangladesh Protesters try to seize Yunus residence:   బంగ్లాదేశ్‌లో మళ్ళీ అశాంతి చెలరేగుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయిన తర్వాత తొలిసారిగా జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.  శనివారం నిరసనకారులు భారీ సంఖ్యలో రాజధాని ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు  మహమ్మద్ యూనస్ అధికారిక నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.  2024 ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయినప్పుడు చోటుచేసుకున్న ఉద్రిక్త దృశ్యాలు మళ్ళీ ఢాకా వీధుల్లో కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యం, పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఆగ్రహంతో ఉన్న వేలాది మంది నిరసనకారులు, యూనస్ నివాసం వైపు దూసుకువెళ్లారు. భద్రతా బలగాలు బారికేడ్లు వేసి అడ్డుకున్నప్పటికీ, తోపులాట జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ ఘటన ఢాకాలో పాత ఘటనలను గుర్తుకు తెచ్చింది.  

షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత శాంతి భద్రతలను పునరుద్ధరించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంలో తాత్కాలిక ప్రభుత్వం జాప్యం చేస్తోందని విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్కరణల పేరుతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారా  అన్న అనుమానం నిరసనకారుల్లో బలంగా నాటుకుపోవడం ఈ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమైంది.  

 రాజకీయ అనిశ్చితికి తోడు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ప్రజలను వీధుల్లోకి తెస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, నిరుద్యోగం పెరగడంపై సామాన్యులు ఆగ్రహంతో ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వం కేవలం రాజకీయ సంస్కరణలకే ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని నిరసనకారులు నినదిస్తున్నారు.  యూనస్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.  

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ఢాకాలోని కీలక ప్రాంతాల్లో సెక్యూరిటీని భారీగా పెంచారు. సరిహద్దుల వద్ద కూడా నిఘాను కట్టుదిట్టం చేశారు. షేక్ హసీనా పారిపోవడానికి ఏర్పడిన తరహా పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని సైనిక నాయకత్వం భావిస్తోంది.