Bangladesh elections: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు - ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతైనా హిందువులపై దాడులు ఆగుతాయా?
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రజా ప్రభుత్వం లేకుండా ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా హిందువులపై దాడులు తగ్గుతాయా?

Bangladesh elections Today: బంగ్లాదేశ్‌లో ఉత్కంఠకు తెరదించుతూ గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. షేక్ హసీనా 15 ఏళ్ల పాలన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన 18 నెలల తర్వాత దేశం మొదటిసారిగా ఓటు వేస్తోంది. 300 పార్లమెంటరీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీలో లేదు. పోటీ చేయకుండా నిషేధం విధించారు. ప్రస్తుతం తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ .. బీఎన్‌పీ ప్రధాన పార్టీగా ఉంది. ఆ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.
హసీనా అప్పగింత - బీఎన్‌పీ డిమాండ్
సుదీర్ఖ కాలం ప్రవాసంలో ఉండి.. లండన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన తారిఖ్ రహ్మాన్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రేసులో ఉన్నారు. అయితే, ఎన్నికల ప్రచారంలో బీఎన్‌పీ ప్రధానంగా షేక్ హసీనా అప్పగింత అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇండియాలో తలదాచుకున్న హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని, ఇక్కడ ఆమెపై నమోదైన మానవత్వానికి వ్యతిరేక నేరాలపై విచారణ జరగాలని వారు గట్టిగా కోరుతున్నారు. బంగ్లాదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే ఇది తప్పదని పార్టీ భావిస్తోంది.
బీఎన్‌పీ గెలిస్తే భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి?
భారత్‌తో సంబంధాల విషయంలో బీఎన్‌పీ ఒక తెలివైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు హసీనాను అప్పగించాలని డిమాండ్ చేస్తూనే, మరోవైపు భారత్‌తో బలమైన వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను కోరుకుంటోంది. కేవలం అవామీ లీగ్ పక్షపాతిగా కాకుండా, బంగ్లాదేశ్ ప్రజలతో భారత్ స్నేహాన్ని పెంచుకోవాలని బీఎన్‌పీ సూచిస్తోంది. భారత్ తమకు మిత్రుడే కానీ యజమాని' కాదన్న సంకేతాన్ని పదేపదే ఇస్తోంది. అయితే, హసీనాను అప్పగించని పక్షంలో సంబంధాలు మరింతగా చెడిపోయే అవకాశం ఉందని తారిఖ్ రహ్మాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
హిందువులపై దాడులు తగ్గుతాయా?
ఎన్నికల తర్వాత అరాచకం తగ్గుతుందా అంటే పరిస్థితులు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. షేక్ హసీనా హయాంలో అణిచివేతకు గురైన బీఎన్‌పీ , జమాత్-ఎ-ఇస్లామీ కార్యకర్తలు ఇప్పుడు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు, అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం దేశంలో శాంతిభద్రతలను ఎలా కాపాడుతుందనేది వారి మొదటి పరీక్షగా మారనుంది. హిందువులపై దాడులను అరికట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అవామీ లీగ్ రేసులో లేకపోవడంతో, బీఎన్‌పీకి ప్రధాన పోటీ ఇప్పుడు జమాత్-ఎ-ఇస్లామీ పార్టీ నుండే ఎదురవుతోంది. జమాత్ పార్టీ భారత్ పట్ల అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. జమాత్ గెలిస్తే పాకిస్థాన్, చైనాలకు దగ్గరయ్యే ప్రమాదం ఉందని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో బీఎన్‌పీ ఒక సెంట్రిస్ట్ పార్టీగా భారత్‌కు కొంత మెరుగైన ఎంపికగా కనిపిస్తోంది. కానీ, బీఎన్‌పీ కూడా జమాత్ ప్రభావం నుండి బయటపడలేకపోతే భారత్‌తో సంబంధాలు సవాలుగా మారవచ్చు.
ఎన్నికల తరవాత కొత్త రాజ్యాంగం ?
ఎన్నికల ఫలితాల తర్వాత బంగ్లాదేశ్ ఒక కొత్త రాజ్యాంగం దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో పాటే రాజ్యాంగ సంస్కరణలపై రెఫరెండం కూడా జరుగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే ప్రభుత్వం భారత్ భద్రతా ఆందోళనలను ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం ఎలా గౌరవిస్తుందనే దానిపైనే ఇరు దేశాల మధ్య మైత్రి ఆధారపడి ఉంటుంది.























