Andhra Pradesh Rains Updates | అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తాయని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వివిధ జిల్లాలకు అలర్ట్‌లను జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
ఈ ద్రోణి ప్రభావం కారణంగా సోమవారం నాడు (జూన్ 15న) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
వాతావరణంలో మార్పులు, వర్షాల తీవ్రతను బట్టి విపత్తు నిర్వహణ సంస్థ జిల్లాల వారీగా అలర్ట్‌లు జారీ చేసింది.
రెడ్ అలర్ట్ : శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆరెంజ్ అలర్ట్ : అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఎల్లో అలర్ట్ : కాకినాడ, తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ బయట తిరగవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, పట్టణాల్లో భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
