Alcohol ban lifted in Saudi Arabia: కఠినమైన నియమాలు పాటించే సౌదీ అరేబియా లో కూడా కాలానికి తగ్గట్లుగా మారే ప్రయత్నాలు చేస్తోంది. ఏడు దశాబ్దాలుగా ఆ దేశంలో మద్యానికి అనుమతి లేదు. ఇప్పుడు నిబంధనలు సడలిస్తోంది. 

గత ఏడాది దౌత్యవేత్తలకు అందుబాటులోకి మద్యం                              2024 జనవరిలో, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని డిప్లొమాటిక్ క్వార్టర్‌లో 72 సంవత్సరాల తర్వాత మొదటి మద్యం దుకాణాన్ని ప్రారంభించింది. ఈ దుకాణం  కేవలం నాన్-ముస్లిం దౌత్యవేత్తలకు మాత్రమే మద్యం విక్రయిస్తుంది.   కొనుగోలు చేయడానికి దౌత్యవేత్తలు తప్పనిసరిగా ఒక మొబైల్ యాప్   ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి, దౌత్య గుర్తింపును చూపించాలి. నెలవారీ కోటాలను పాటించాలి.   దుకాణంలో ఫోటోలు తీయడాన్ని నిషేధించారు.  ఇప్పుడు మరింతగా సడలింపు ఇవ్వాలని సౌదీ భావిస్తోంది.   2026 నాటికి, సౌదీ అరేబియా తమ 73 ఏళ్ల మద్య నిషేధాన్ని మరింత సడలించాలని యోచిస్తోంది, దీని కింద దేశవ్యాప్తంగా సుమారు 600 లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లు,  పర్యాటక స్థలాలలో  మద్యం అమ్మకాలను అనుమతించనున్నారు.

20శాతం కంటే తక్కువ అల్కహాల్ ఉన్న వాటికి అనుమతి                  

సౌదీలో త్వరలో అనుమతి ఇవ్వనున్న మద్యం  అమ్మకాలు కేవలం  20 శాతం  కంటే తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలకు మాత్రమే పరిమితం చేస్తారు.  ఇవన్నీ పర్యాటకులు, విదేశీయులు ఉండే ప్రాంతాలకు పరిమితం.   రియాద్ ఎక్స్‌పో 2030 , FIFA వరల్డ్ కప్ 2034 వంటి అంతర్జాతీయ ఈవెంట్‌లను ఆకర్షించడానికి, పర్యాటక రంగాన్ని పెంచడానికి మెల్లగా మద్యం విషయంలో సౌదీ పాలకులు నిబంధనలు సడలిస్తున్నారు. సాధారణ పౌరులు, ముఖ్యంగా ముస్లింలు, మద్యం కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధం కొనసాగుతుంది.  ఈ మద్యం నిషేధ సడలింపు విజన్ 2030లో భాగం, ఇది సౌదీ అరేబియాను ఆర్థికంగా బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం , జీడీపీలో పర్యాటక రంగం వాటా 2030 నాటికి   10 శాతానికి చేర్చడం వంటి లక్ష్యాల కోసం అమలు చేస్తున్నారు.   UAE , బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల్లో విజయవంతమైన మద్యం నియంత్రణ విధానాలను అనుసరించి, సౌదీ అరేబియా నియంత్రిత వాతావరణంలో మద్యం అమ్మకాలను అనుమతించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది   

మద్య నిషేధం వెనుక భిన్నమైన స్టోరీ 

సౌదీ అరేబియాలో మద్య నిషేధం 1952 నుండి అమలులో ఉంది. దీనికి కారణం రాజు అబ్దుల్‌అజీజ్ కుమారుడు ప్రిన్స్ మిషారీ మద్యం మత్తులో బ్రిటిష్ వైస్-కాన్సుల్ సిరిల్ ఓస్మాన్‌ను జిద్దాలో హత్య చేశాడు.  ఇస్లామ్‌లో మద్యం "హరామ్" గా పరిగణించబడుతుంది.  సౌదీ అరేబియా  మక్కా , మదీనా వంటి పవిత్ర స్థలాల స్థానంగా ఉంది. అందుకే అప్పట్నుంచి  ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసింది. అయితే, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్  విజన్ 2030 ప్రణాళిక కింద, దేశం ఆర్థికంగా బలోపేతం చేయడం,  పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి సామాజిక సంస్కరణలను చేపట్టింది.