World largest Shiva lingam installed: బీహార్‌లోని విరాట్ రామాయణ మందిరం ప్రాంగణంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించడం సనాతన వారసత్వానికి ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇప్పటివరకు చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయ ప్రాజెక్టులలో ఇది ఒకటి.ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచే ఈ మహత్కార్యానికి జనవరి 17వ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన జ్యోతిష్య , శాస్త్ర కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మకర సంక్రాంతి తర్వాత సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించిన తొలి రోజుల్లోనే ఈ ప్రతిష్ఠాపన జరగడం విశేషం. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ కాలం దేవతలకు పగలుతో సమానం, ఈ సమయంలో జరిగే ప్రతిష్ఠాపనలు,పూజలు అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. భక్తుల కోరికలను నెరవేర్చే శివుని 'లింగ రూపం' ప్రతిష్ఠించడానికి ఈ పవిత్ర కాలం అత్యంత శుభప్రదమైనది.
శనివారం కావడం జ్యోతిష్య శాస్త్ర రీత్యా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి, నక్షత్రాలు కలవడం ఈ ముహూర్తం వెనుక ఉన్న మరో రహస్యం. శివుడిని లయకారుడిగా, కాల స్వరూపిగా కొలుస్తారు కాబట్టి, కాల నిర్ణయంలో శని ప్రభావం ఉన్న శనివారం నాడు శివలింగ ప్రతిష్ఠాపన చేయడం వల్ల భక్తులకు కర్మ దోషాల నుండి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. ప్రధాన శివలింగంతో పాటు 1072 ఇతర ఉపాలయాల మూర్తులను ఒకేసారి ప్రతిష్ఠించడం ద్వారా ఆ ప్రాంతం శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుతుందని ఆగమ శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.
ఈ అతిపెద్ద శివలింగం ఎత్తు , వైశాల్యం పరంగా గిన్నిస్ రికార్డులకు చేరువలో ఉండటం విశేషం. ప్రతిష్ఠాపన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశంలోని వివిధ పవిత్ర నదుల నుండి తెచ్చిన జలాలను, ప్రత్యేక మూలికలను ఉపయోగించారు. 1072 విగ్రహాలను ఒకే వరుసలో లేదా ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించడం వెనుక ఉన్న సంఖ్యా శాస్త్రం కూడా శివతత్వానికి అనుగుణంగా ఉందని, ఇది విశ్వశాంతిని పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమమని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇది కేవలం ఒక విగ్రహ ప్రతిష్ఠాపన మాత్రమే కాదు, భావితరాలకు మన సంస్కృతిని, శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పే ఒక అద్భుత నిర్మాణం. ఈ క్షేత్రం ప్రపంచవ్యాప్త పర్యాటకులను, శివ భక్తులను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా మారనుంది.