Woman IPS officer gives strong reply to Maharashtra Deputy CM: రాజకీయ నాయకులు చేసే అక్రమాలకు వంత పాడే ఆఫీసర్లు కొంత మంది ఉంటారు. రూల్స్ ప్రకారం వెళ్లేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి ఆఫీసరే అంజనాకృష్ణ. మహారాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు గట్టి షాక్ ఇచ్చారు.
మహారాష్ట్ర రాష్ట్రంలోని సొలాపూర్ జిల్లాలోని కుర్దు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దాంతో పోలీసులు మట్టి తవ్వకాలను ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. కర్మాల సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజన కృష్ణ ఆ ప్రాంతానికి సిబ్బందితో వెళ్లారు. ఆ సమయంలో స్థానికులు , తవ్వకాలు చేస్తున్న వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు బాబా జగ్తాప్ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఆ ఫోన్‌ను ఐపీఎస్ అంజన కృష్ణకు ఇచ్చారు.
అజిత్ పవార్ తాను డిప్యూటీ సీఎం అని చెప్పి, తవ్వకాలపై చర్యలు నిలిపివేయాలని ఆదేశించారు. "నీవు ఎవరో తెలియకపోతే నీపై చర్యలు తీసుకుంటాను. నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?" అని ఆయన హెచ్చరించారు. దీనికి అంజన కృష్ణ స్పందిస్తూ, "మీరు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? దయచేసి నా ఫోన్ నంబర్‌కు నేరుగా కాల్ చేయండి" అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత, అజిత్ పవార్ వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడారు. అక్రమంగా మట్టి తవ్వేవారిపై చర్యలు ఆపాలని మరోసారి ఆదేశించారని తెలుస్తోంది. కానీ అంజనా కృష్ణ ఆ మాటలు పట్టించుకోలేదు. అంజన కృష్ణ 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 355వ ర్యాంకు సాధించి, 2023 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమె, సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి వస్త్ర వ్యాపారం చేస్తారు, తల్లి స్థానిక కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తారు. సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసి, హెచ్‌హెచ్‌ఎంఎస్‌పీబీ ఎన్‌ఎస్‌ఎస్ కాలేజీలో గణితశాస్త్రంలో డిగ్రీ పొందారు. ఆమె నిజాయితీగా విధులు నిర్వహిస్తారని పేరు తెచ్చుకున్నారు.
గ్రామ పంచాయతీ అనుమతితో తవ్వకాలు జరిగాయని స్థానికులు వాదించినప్పటికీ, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక పత్రాలను చూపించలేకపోయారు. అంజన కృష్ణ తన చర్యలను కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. అంజన కృష్ణ ధైర్యాన్ని, వృత్తి నిబద్ధతను చాలా మంది ప్రశంసించారు.