Will BJP face political losses with changes in the job guarantee scheme : గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చుట్టూ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకంలో తీసుకొస్తున్న మార్పులు, సాంకేతిక ఆంక్షలు, నిధుల కేటాయింపులపై గ్రామీణుల్లో ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది.
గ్రామీణ గుండెకాయ.. ఉపాధి హామీ
భారతదేశంలోని కోట్ల మంది కూలీలకు ఉపాధి హామీ పథకం కేవలం ఒక పని మాత్రమే కాదు, అది వారి ఆర్థిక భద్రత. ముఖ్యంగా వ్యవసాయం లేని రోజుల్లో ఈ పథకం గ్రామీణ పేదల ఆకలి తీరుస్తోంది. రాజకీయంగా చూస్తే, ఈ పథకం ఏ పార్టీకైనా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకును అందిస్తుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ పథకం ద్వారానే రెండోసారి అధికారంలోకి వచ్చిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు దీనిని కదిలించడం అంటే, నేరుగా గ్రామీణ ఓటర్ల పొట్ట కొట్టడమేనన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.
కొత్త నిబంధనలతో ఆందోళన
బీజేపీ ప్రభుత్వం పారదర్శకత పేరుతో ప్రవేశపెట్టిన కొన్ని మార్పులు క్షేత్రస్థాయిలో ప్రతికూలతను తెచ్చిపెడుతున్నాయి. మొబైల్ యాప్ ద్వారా రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసి అటెండెన్స్ వేయాలన్న నిబంధన నెట్‌వర్క్ లేని మారుమూల గ్రామాల్లో పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల పనులు చేసినా కూలీ పడటం లేదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానంలో సాంకేతిక లోపాల వల్ల వేలాది మంది కూలీలు తమ వేతనాలను కోల్పోతున్నారు. ఈ పథకానికి నిధులు తగ్గించడం, రాష్ట్రాలు నలభైశాతం భరించాలనే రూల్ తో .. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తాయన్న భావనపెరుగుతోంది.
బీజేపీ రాజకీయ వ్యూహం - రిస్క్ ఉందా?
బీజేపీ ఈ పథకాన్ని ఆస్తుల సృష్టి వైపు మళ్ళించాలని చూస్తోంది. అంటే కేవలం గుంతలు తీయడం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన చెరువులు, కాలువలు వంటివి నిర్మించాలని భావిస్తోంది. అయితే, ఈ క్రమంలో యంత్రాల వాడకం పెరగడం వల్ల కూలీలకు పని తగ్గుతోంది. గ్రామీణ ఓటర్లు ఈ మార్పులను తమకు వ్యతిరేకంగా భావిస్తే, రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి ఉపాధి హామీలో అసంతృప్తి కూడా ఒక కారణమని భావిస్తున్నారు.
పేర్లు మార్పు - సిద్ధాంతపరమైన పోరు
ఈ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించారు. వీబీజీ రామ్ జీ అనే పేరు పెట్టారు. విపక్షాలు దీనిని కాంగ్రెస్ మార్క్ పథకం కావడంతోనే బీజేపీ ఇలా చేస్తోందని ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ పథకం స్వరూపం పూర్తిగా మారిపోతే, గ్రామీణ పేదలు దీనిని తమ హక్కుగా కాకుండా ప్రభుత్వ దయగా భావించే ప్రమాదం ఉంది. ఇది ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది.
విశ్లేషణ: లాభమా? నష్టమా?
టెక్నాలజీ పేరుతో అవినీతిని అరికట్టడం మంచిదే అయినప్పటికీ, అది సామాన్య కూలీకి భారంగా మారకూడదు. కేంద్రం తీసుకొస్తున్న మార్పులు పరిపాలనా సంస్కరణలు అని బీజేపీ అంటున్నప్పటికీ, ప్రజల్లోకి అది పథకం కోత గా వెళ్తే మాత్రం బీజేపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలక తప్పదు. ముఖ్యంగా గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తున్నారు. మరి బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా?