Viral Video: కశ్మీర్‌లో గందెర్బల్ జిల్లాలో చిరుత వైల్డ్‌లైఫ్ అధికారులపై దాడి చేసిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. చిరుతను పట్టుకునేందుకు వెళ్లిన అధికారులపై ఒక్కసారిగా ఎగబడింది. ఓ అధికారి చేయిని నోటితో గట్టిగా కరుచుకుంది. వెంటనే పక్కనున్న అధికారులు పెద్ద పెద్ద కర్రలతో దాడి చేశారు. చాలా సేపు శ్రమించి ఎలాగోలా చిరుతను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి ఎలాంటి హాని చేయకుండా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎలాంటి ఆయుధాలు లేకుండా వచ్చారు అధికారులు. కానీ ఉన్నట్టుండి అది దాడి చేయడం వల్ల అక్కడే ఉన్న కర్రలతో దాడి చేయాల్సి వచ్చింది. చిరుత దాడిలో ఓ అధికారి గాయపడ్డాడు. ఆ తరవాత మిగతా అధికారులు మత్తు మందు ఇచ్చారు. ఫలితంగా అది స్పృహ కోల్పోయింది. వెంటనే ఆ చిరుతను అధికారులు బంధించారు. గందేర్బల్‌లోని ఫతేపూర గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిరుత గ్రామంలో తిరుగుతోందని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆ తరవాత స్థానికులతో పాటు కలిసి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చిరుత ఐదుగురిపై దాడి చేసింది. వీళ్లలో ఇద్దరు మహిళలున్నారు. గాయపడ్డ ఐదుగురినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.