What is Modi going to say: శనివారం రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026 వీగిపోయిన మరుసటి రోజే ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 నుండి వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, ఒక కీలక రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడం ఇదే మొదటిసారి.
బిల్లును ఓడించడంపై ప్రధాని ఆగ్రహం
శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులు ఐక్యంగా దీనిని వ్యతిరేకించారు. అయితే మహిళా బిల్లును ఓడించడంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన శిక్ష అనుభవించాల్సిందేనని చెబుతున్నారు.
మోదీ ఆగ్రహం.. విపక్షాలకు హెచ్చరిక
బిల్లు వీగిపోయిన అనంతరం ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు దేశంలోని కోట్లాది మంది మహిళలకు ద్రోహం చేశాయని, వారు దీనికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించినట్లు సమాచారం. విపక్షాల తప్పును దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి అని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాత్రి ప్రసంగంలో కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, విపక్షాల మహిళా వ్యతిరే వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంది.
సంచలన నిర్ణయం ఉంటుందా?
సాధారణంగా రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయం అంటే దేశం ఏదో ఒక పెద్ద ప్రకటనను ఆశిస్తుంది. మహిళా బిల్లును పార్లమెంటులో వీగిపోయినప్పటికీ, దానిని అమల్లోకి తీసుకురావడానికి ఉన్న ఇతర మార్గాలను ప్రధాని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల కోసం ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయడం లేదా రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై ఆయన ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దక్షిణాది భయాలకు సమాధానం
నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కూడా ప్రధాని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మహిళా హక్కులు ,రాష్ట్రాల హక్కుల మధ్య సమతుల్యతను ఎలా కాపాడబోతున్నారో ఆయన వివరించవచ్చు. విపక్షాల అడ్డంకులను అధిగమించి మహిళా సాధికారత దిశగా తన ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా ఉంటాయో మోదీ ఈ ప్రసంగం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పబోతున్నారు. రాజకీయ చదరంగంలో విపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా ప్రధాని మాస్టర్ స్ట్రోక్ ఉంటుందో లేదో తెలియాలంటే రాత్రి 8:30 వరకు వేచి చూడాల్సిందే.
